Delhi Chalo: ఇటు కేంద్రం చర్చలు.. అటు ట్రాక్టర్ల బారులు!

ఈ నెల 13న రైతుల ‘చలో దిల్లీ’ నేపథ్యంలో హరియాణా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు.

Published : 12 Feb 2024 21:38 IST

చండీగఢ్‌: ‘దిల్లీ చలో (Delhi Chalo)’ ఆందోళనలో పాల్గొనేందుకు పంజాబ్‌లోని అమృత్‌సర్‌, మోగా, భఠిండా, జలంధర్‌ తదితర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు బయల్దేరాయి. ఫతేహ్‌గఢ్‌ సాహిబ్‌, సంగ్రూర్‌ జిల్లాల్లో అవి ఒకచోటకు చేరతాయని సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ వెల్లడించారు. అంతకుముందు మొహాలీలో కర్షక నేతలు సమావేశం నిర్వహించారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం సోమవారం రైతు సంఘాల నేతలతో మరో దఫా చర్చలు ప్రారంభించింది.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో ఈ నెల 13న పార్లమెంటు వరకు ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టేందుకు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 200కుపైగా రైతు సంఘాలు ఈ నిరసనలో భాగమయ్యే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేలమంది రైతులు దిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలోనే హరియాణా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

రైతులకు అడ్డుగా ముళ్లకంచెలు

పంజాబ్‌తో సరిహద్దును పంచుకునే అంబాలా, జీంద్‌, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా తదితర జిల్లాల్లోని రహదారులను హరియాణా పోలీసులు ఇప్పటికే మూసివేశారు. రోడ్లపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. ప్రభుత్వం 15 జిల్లాల్లో 144 సెక్షన్‌ విధించింది. దిల్లీలోనూ నెల రోజులపాటు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. 2020-21లో రైతుల నిరసనలు సుదీర్ఘంగా కొనసాగిన సింఘు, గాజీపుర్‌, టిక్రీ సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని