Rahul Gandhi: రాహుల్‌ న్యాయ్‌ యాత్రలో మార్పులు.. ఎందుకంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 26 వరకు కొనసాగాల్సిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ వ్యవధిని తగ్గిస్తూ.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మార్పులు చేశారు.

Updated : 12 Feb 2024 13:33 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ఉత్తర్‌ప్రదేశ్‌ షెడ్యూల్‌ మారింది. ఆ రాష్ట్రంలో కొనసాగాల్సిన యాత్ర కాల వ్యవధిని తగ్గించినట్లు పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. యూపీలో 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ సవరణలు చేసినట్లు తెలిపారు.

‘‘రాహుల్‌ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్‌ మార్పులు చేశారు’’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ ప్రకటనలో వెల్లడించారు.

బడ్జెట్‌ సమావేశాలు.. ప్రసంగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్‌

దీని ప్రకారం.. ఫిబ్రవరి 16న వారణాసి మీదుగా యాత్ర యూపీలోకి ప్రవేశిస్తుంది. అనంతరం భదోహి, ప్రయాగ్‌రాజ్‌, ప్రతాప్‌గఢ్‌ మీదుగా 19న అమేఠీకి చేరుతుంది. ఆ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌ బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రాయ్‌బరేలీకి చేరుకుని.. అక్కడి నుంచి లఖ్‌నవూలో రాహుల్‌తో సహా మార్చ్‌లో పాల్గొంటారు. ఆ రాత్రి అక్కడే బస చేసే అవకాశం ఉంటుంది. 21న కాన్పూర్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోకి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఇకనైనా మేల్కోండి: రాహుల్

ప్రస్తుతం యాత్ర ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ కేంద్రంలోని భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రజలకు ఉపాధి కరవైందని.. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశ జనాభాలో 74 శాతం మంది వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలే ఉన్నారు. భారత్‌లో అగ్రశ్రేణిలో ఉన్న 200 కంపెనీల్లో ఎక్కువగా ప్రజాధనం ఉంది. వీటిలో ఏ ఒక్కదానిలోనూ ఓ దళితుడు యజమానిగా లేడు. మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ మీ జేబులను దోచుకుంటున్నారు. ఇకనైనా మేల్కోండి’’ అని రాహుల్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని