Taiwan: చైనాకు భయపడిన అమెరికా.. తైవాన్‌ మంత్రి ప్రసంగానికి కోత..! 

అమెరికా నిర్వహించిన ప్రజస్వామ్య సదస్సు 2021లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకొంది. ఈ సదస్సుకు చైనాను కాకుండా

Updated : 13 Dec 2021 16:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు 2021లో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. ఈ సదస్సుకు చైనాను కాకుండా తైవాన్‌ను ఆహ్వానించి బైడెన్‌ సర్కారు సంచలనం సృష్టించింది. కానీ, తైవాన్‌ మంత్రి ప్రసంగిస్తుండగా.. చైనాకు భయపడి అర్ధాంతరంగా ఆ వీడియోను కట్‌ చేసింది. చివరికి మాకేమీ సంబంధం లేదంటూ ఓ ప్రకటన కూడా వెలువరించింది. ఈ విషయాన్ని అమెరికా స్థానిక పత్రికలు బయటపెట్టాయి.

ప్రజాస్వామ్య  సదస్సులో తైవాన్‌ తరఫున మంత్రి ఆడ్రీ టాంగ్‌ పాల్గొని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన ఒక మ్యాప్‌ను చూసి శ్వేతసౌధం అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆ మ్యాప్‌లో చైనా, తైవాన్‌లు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. దీంతో ఇది అమెరికా ‘వన్‌ చైనా పాలసీ’కి విరుద్ధమంటూ వెంటనే ఆమె ప్రసంగం వీడియో లైవ్‌ను నిలిపివేశారు. ఆ మ్యాప్‌ను తొలగించాలని కోరారు. ఈ గందరగోళంలో తైవాన్‌ మంత్రి ప్రసంగం వీడియో మొత్తం పోయింది. కేవలం ఆడియో మాత్రమే వినిపించింది.  అనంతరం శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించిన అభిప్రాయాలు వారి సొంతం.. అమెరికా అభిప్రాయాలను ఏ మాత్రం ప్రతిబింబించవు’’ అని దానిలో పేర్కొంది.

తైవాన్‌ మంత్రి టాంగ్‌ చూపిన మ్యాప్‌ను దక్షిణాఫ్రికాకు చెందిన ‘సివికస్‌’ అనే ఎన్‌జీవో తయారు చేసింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా, మానవ హక్కులకు సంబంధించిన ర్యాంకులను ఇచ్చింది. ఇవి చైనా, తైవాన్‌ను వేర్వేరు రంగుల్లో చూపిస్తున్నాయి. ఈ మ్యాప్‌లో తైవాన్‌ ఆకుపచ్చ రంగులో ఉండగా.. చైనా, ఉత్తర కొరియా, వియత్నాంలు ఎరుపు రంగులో ఉన్నాయి.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని