US concerned: తాలిబన్‌ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన..!

తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వంలో పలువురు మంత్రుల ఎంపికపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మంత్రి వర్గంలో చాలా మంది గతంలో అమెరికా దళాలపై దాడులు చేసిన వ్యక్తులుండటం గమనార్హం. ఈ మంత్రి వర్గానికి నేతృత్వం వహించే ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుండ్‌ ఐరాస

Published : 08 Sep 2021 21:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వంలో పలువురు మంత్రుల ఎంపికపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మంత్రి వర్గంలో చాలా మంది గతంలో అమెరికా దళాలపై దాడులు చేసిన వ్యక్తులుండటం గమనార్హం. ఈ మంత్రి వర్గానికి నేతృత్వం వహించే ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుండ్‌ ఐరాస నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. అదే సమయంలో మరో మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీ అమెరికా ఎఫ్‌బీఐ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు. 

దీనిపై అమెరికా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు, వారి సన్నిహితులతో విడుదల చేసిన జాబితాలో మహిళలు ఎవరికీ స్థానం దక్కక పోవడాన్ని మేము గుర్తించాము. వారిలో కొందరికి ఉన్న గుర్తింపు, గత చరిత్రపై మేము ఆందోళన చెందుతున్నాము. మాటలను బట్టి కాదు.. పనితీరును బట్టి తాలిబన్లను అంచనావేస్తుంది’’ అని పేర్కొంది. 

విదేశీయులను, పత్రాలు ఉన్నవారిని వెళ్లనీయాలి..

అఫ్గాన్లో చిక్కుకుపోయిన విదేశీయులను, ప్రయాణాలకు అవసరమైన పత్రాలు ఉన్న అఫ్గాన్లను దేశం దాటేందుకు అనుమతించాలని అమెరికా సూచించింది. అఫ్గాన్‌ బయట ప్రయాణాలకు సిద్ధంగా ఉన్న విమానాలను కూడా అనుమతించాలని పేర్కొంది. అఫ్గాన్‌ గడ్డను విదేశీ ఉగ్రవాదులను వాడుకోనీయమన్న హామీకి కట్టుబడాలని పేర్కొంది. అదే సమయంలో తాలిబన్ల పనితీరు ప్రపంచం నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు.

అమెరికా ఉగ్రజాబితాలో సిరాజుద్దీన్‌ హక్కానీ..

హక్కానీ నెట్‌వర్క్‌ అధినేత సిరాజుద్దీన్‌ అమెరికా ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. హక్కానీ గ్రూపు 2017లో కాబూల్‌లో జరిపిన ట్రక్కు బాంబు పేలుడులో  150 మంది మరణించారు. హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఈ జాబితాలో అల్‌ఖైదా కూడా ఉంది. 2008లో ఒక హోటల్‌పై జరిగిన దాడిలో కూడా హక్కానీ నెట్‌ వర్క్‌ హస్తం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని