Viral video: మహిళను కారులోకి లాక్కెళ్లి.. కొట్టడంపై DCW సీరియస్‌!

దిల్లీలో ఓ మహిళను లాక్కెళ్లి కారులోకి బలవంతంగా ఎక్కించి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.

Published : 19 Mar 2023 22:11 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో రోడ్డుపై ఓ మహిళను బలవంతంగా కారులోకి లాక్కెళ్లి దాడి చేసిన వీడియో వైరల్‌(viral video) కావడంతో దిల్లీ మహిళా కమిషన్‌(DCW) సీరియస్‌గా స్పందించింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌(Swath maliwal) పోలీసులకు లేఖ రాశారు.  ఈ ఘటనలో తీసుకున్న చర్యలపై ఈ నెల 23 లోపు తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు, ఓ మహిళను బలవంతంగా కారులోకి నెట్టేసి.. ఆపై ఆమెను కొట్టినట్లుగా రికార్డయిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఈ ఘటన దిల్లీలోని మంగోల్‌పురి ఫ్లైఓవర్‌ సమీపంలో శనివారం రాత్రి 9.45 గంటల సమయంలో చోటుచేసుకుందని తెలిపారు. ఆ  క్యాబ్‌ను గుర్తించినట్టు వెల్లడించారు.

హరియాణా రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉన్న ఈ కారు గుడ్‌గావ్‌లోని రతన్‌ విహార్‌ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీనిపై ఔటర్‌ దిల్లీ  డిసీపీ హరేంద్ర కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ..  ఆ కారు డ్రైవర్‌ ఆచూకీని గుర్తించినట్టు చెప్పారు. ఇది ఉబర్‌ క్యాబ్‌ అని.. దీన్ని రోహిణి నుంచి వికాస్‌పురికి ఇద్దరు యువకులతో పాటు ఓ మహిళ బుక్‌ చేసుకున్నట్టు చెప్పారు. మార్గమధ్యంలో ఈ ముగ్గురికీ గొడవ తలెత్తగా.. మహిళ బయటకు వెళ్లాలనుకుందని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనిపై  దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని