Adani Group: ఎల్‌ఐసీ పెట్టుబడులు.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం ఎవరిది..?

అదానీ గ్రూపులో ఎల్‌ఐసీ (LIC) పెట్టుబడులు పెట్టాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎవరు తీసుకున్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) ప్రశ్నించారు. ఇప్పటివరకు సంస్థ పొందిన లాభాలు కొన్ని రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోవడంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated : 27 Feb 2023 21:45 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక (Hindenburg Research) అనంతరం అదానీ గ్రూపు సంస్థ షేర్ల విలువ భారీగా పడిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం అదానీ గ్రూపులో (Adani Group) పెట్టుబడులు పెట్టిన భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వంటి వాటిపైనా పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్‌ఐసీని అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టాలనే సాహసోపేతమైన నిర్ణయం ఎవరిదని కాంగ్రెస్‌  ప్రశ్నించింది. వీటికి సంబంధించి పలు ప్రశ్నలను ప్రధాని మోదీకి సంధించింది.

‘అదానీ గ్రూపు స్టాక్స్‌ వరుసగా అమ్మకానికి గురవుతున్నాయి. దీంతో డిసెంబర్‌ 31, 200 నుంచి ఎల్‌ఐసీ హోల్డింగ్‌ విలువ ఊహించని విధంగా రూ. 52వేల కోట్లు తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి విలువ రూ.32వేల కోట్లుగా ఉంది. స్టాక్‌ మార్కెట్‌లో తారుమారు, మనీలాండరింగ్‌ కారణంగా ఎల్‌ఐసీ పొందిన మొత్తం లాభం తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఎల్‌ఐసీకి తీవ్ర నష్టం వాటిల్లింది’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ ఆరోపించారు. నచ్చిన వ్యాపారవేత్త కోసం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఎల్‌ఐసీపై ఎవరు ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. లక్షల మంది భారత పౌరుల పొదుపుతో ఆటలాడిన ఈ వ్యవహారంపై మీరెప్పుడు జవాబుదారీగా ఉంటారని జైరాం రమేశ్‌ నిలదీశారు.

ప్రధాని మౌనం వీడాలి

ఎస్‌ అండ్‌ పీ డౌజోన్స్‌, ఎంఎస్‌సీఐ, ఎఫ్‌టీఎస్‌ఈ రసెల్స్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్లు అదానీ గ్రూపు కంపెనీలపై సమీక్ష చేస్తున్నప్పటికీ నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ (NSE) మాత్రం మదుపరుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ‘మీ మిత్రుడికి బెయిల్‌ ఔట్‌ ప్రకటించేందుకు ఎన్‌ఎస్‌ఈపైనా ఒత్తిడి తెస్తున్నారా..? చర్యలు తీసుకునే సెబీని కూడా ఎందుకు అనుమతించడం లేదు’ అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ముంబయిలోని ధారావి అభివృద్ధి ప్రాజెక్టు టెండర్‌ అదానీ గ్రూపునకు దక్కడాన్ని ఎత్తిచూపారు. ఈ విషయాలన్నింటిపై ప్రధాని మోదీ మౌనం విడాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని