Published : 27 Jan 2022 01:29 IST

Savji Dholakia: ఈయన మనసు విలువైన ‘వజ్రం’.. అందుకే వరించింది ‘పద్మం’

ఇంటర్నెట్‌డెస్క్‌: చేసేది వజ్రాల వ్యాపారం.. అందుకేనేమో ఆయన మనసు కూడా ఆ వజ్రమంత విలువైనది. ‘సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. లేదంటే లావైపోతాం’ అని ఓ సినిమాలో చెప్పిన వాక్యం.. ఈయనకు అచ్చంగా సరిపోతుంది. తాను ఈ స్థాయికి రావడానికి కష్టంతో పాటు తన కింద పనిచేసే ఉద్యోగుల కృషి కూడా ఉందని భావించే ఆయన.. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సిబ్బందికి ఖరీదైన కానుకలు అందిస్తున్నారు. అంతేనా, పేదవారికి కూడా తనవంతు సాయం చేస్తూ సమాజం రుణం తీర్చుకుంటున్నారు. అందుకే ఆయన మంచి మనసుకు ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. ఆయనే గుజరాత్‌కు చెందిన సావ్జీ ఢోలాకియా..!

నాలుగో తరగతితో చదువు ఆపేసి..

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో 1962 ఏప్రిల్‌ 12న ఓ రైతు కుటుంబంలో సావ్జీ ఢోలాకియా జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువు అంతంత మాత్రమే. అందుకే 13 ఏళ్ల వయసులో 4వ తరగతితోనే చదువు ఆపేశారు. తన మేనమామ దగ్గర పనికోసం 1977లో సూరత్‌ వచ్చారు. అప్పుడు ఆయన జేబులో రూ.12.5 మాత్రమే ఉన్నాయట. కొన్నేళ్ల పాటు సావ్జీ, ఆయన సోదరులు మేనమామ దగ్గరే వజ్రాల పాలిషింగ్‌ వర్క్‌ నేర్చుకున్నారు. ఆ తర్వాత 1984లో సొంతంగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు. 

తొలినాళ్లలో వీరి వ్యాపారం కూడా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత క్రమంగా సావ్జీ నిలదొక్కుకుని.. వ్యాపారంలో ఎదుగుతూ వచ్చారు. 1992లో ముంబయిలో శ్రీ హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో వజ్రాల ఎగుమతులను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి చూసుకునే అవసరం రాలేదు. 2014లో సావ్జీ కంపెనీ టర్నోవర్‌ ఏకంగా 104శాతం పెరిగి రూ.400కోట్లు దాటింది. ప్రస్తుతం సావ్జీ.. దేశంలోనే ప్రధాన వజ్రాల ఎగుమతిదారు కాగా.. ఈయన కంపెనీలో దాదాపు 6500 మంది పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.6వేల కోట్లకు పైమాటే. 50కి పైగా దేశాలకు ఈయన వజ్రాలను ఎగుమతి చేస్తుంటారు. అమెరికా, బెల్జియం, యూఏఈ, హాంకాంగ్‌, చైనాల్లోనూ అనుబంధ సంస్థలున్నాయి. 

సిబ్బందికి ప్రేమతో..

అయితే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తన వద్ద పనిచేసే వారికి తిరిగి ఇవ్వాలనే సిద్ధాంతాన్ని సావ్జీ బలంగా నమ్ముతారు. అందుకే ఏటా సిబ్బంది కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానుకలు అందిస్తున్నారు. 2011లో సావ్జీ పేరు తొలిసారిగా వార్తల్లో వచ్చింది. దీపావళి కానుకగా తన సిబ్బందికి ఖరీదైన బహుమతులతో పాటు బోనస్‌ కూడా అందించారు. ఆ తర్వాత 2015లో సిబ్బందికి 491 కార్లు, 200లకు పైగా ఫ్లాట్లను బహుమతిగా ఇచ్చారు. 2018లో ఏకంగా 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించారు. ఇందులో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అందించారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందించడం విశేషం. దీంతో సావ్జీ పేరు దేశమంతా మార్మోగింది. 

అంతేకాదండోయ్‌.. పేద యువతులకు పెళ్లిళ్లు చేయడం, విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఆయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని