Indore: ఇండోర్‌ స్వచ్ఛతా స్ఫూర్తి.. ‘జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌’కు విస్తృత ప్రచారం!

ఇండోర్‌.. మధ్యప్రదేశ్‌లోని ఈ నగరం స్వచ్ఛతా నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంటుంది. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల్లో స్థానిక అధికారులు పాటిస్తున్న వినూత్న విధానాలే నగరానికి ఈ ఘనతను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంగా...

Published : 06 Dec 2021 23:40 IST

భోపాల్‌: ఇండోర్‌.. మధ్యప్రదేశ్‌లోని ఈ నగరం స్వచ్ఛతా నిర్వహణలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంటుంది. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ తదితర అంశాల్లో స్థానిక అధికారులు పాటిస్తున్న వినూత్న విధానాలే నగరానికి ఈ ఘనతను తెచ్చిపెడుతున్నాయి. ఇదే క్రమంగా ఇండోర్ మున్సిపల్‌ కార్పొరేషన్ (ఐఎంసీ) తాజాగా ‘జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌’ కాన్సెప్ట్‌ను ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. వివాహ వేడుకల్లో వీలైనంత తక్కువ వ్యర్థాల ఉత్పత్తి, క్రమపద్ధతిలో దాని నిర్వహణ.. ఇందులోని కీలక అంశాలు.

ఇటీవల ఐఎంసీ ఉద్యోగి ఒకరు తన వివాహ వేడుకలో అన్ని పర్యావరణహిత సామగ్రినే ఉపయోగించారు. ఆహార పదార్థాలు వడ్డించేందుకు వినియోగించే పాత్రలు మొదలు.. స్వాగత తోరణాలు వరకు ఇలా అన్నింటా వాటిని భాగం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జంటకు ఐఎంసీ తరఫున 'హోమ్ కంపోస్టింగ్ కిట్'ను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. దీంతోపాటు తడి చెత్త ద్వారా అక్కడికక్కడే తయారు చేసిన కంపోస్ట్ ఎరువును ఈ సందర్భంగా అతిథులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

అంకుర సంస్థ తోడ్పాటుతో..

‘గత నెలలో రెండు జీరో-వేస్ట్ వెడ్డింగ్‌లను నిర్వహించాం. రాబోయే రెండు నెలల్లో ఇక్కడ జరిగే దాదాపు 200 వివాహ వేడుకల్లోనూ ఇదే కాన్సెప్ట్‌ను అమలు చేయాలని భావిస్తున్న’ట్లు స్వాహా వ్యవస్థాపకుడు సమీర్ శర్మ చెప్పారు. ఐఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అంకుర సంస్థ.. వ్యర్థాల నిర్వహణలో సహాయపడుతోంది. జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌ కాన్సెప్ట్‌లో RRR  (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) ఫార్ములా వినియోగిస్తున్నామని.. ఇలాంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్, థర్మాకోల్ ఇతరత్రా ఉత్పత్తుల వినియోగం ఉండదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని