దానికి ఎంతో ధైర్యం కావాలి: అనుష్క

‘జేజమ్మ’.. ‘దేవసేన’.. ‘భాగమతి’.. అంటూ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్న కథానాయిక అనుష్క. ఆమె సరికొత్త కథతో తెరకెక్కించిన ‘నిశ్శబ్దం’తో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. హేమంత్‌ మధుకర్‌....

Published : 30 Sep 2020 01:45 IST

ఓటీటీలో ‘నిశ్శబ్దం’.. మీడియాతో దేవసేన ముచ్చట్లు

హైదరాబాద్‌: ‘జేజమ్మ’.. ‘దేవసేన’.. ‘భాగమతి’.. అంటూ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్న కథానాయిక అనుష్క. ఆమె సరికొత్త కథతో తెరకెక్కించిన ‘నిశ్శబ్దం’తో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. హేమంత్‌ మధుకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా అనుష్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

నమ్మకం ఏర్పడి..
‘‘భాగ‌మ‌తి’ సినిమా పూర్తయిన తర్వాత కావాల‌ని విరామం తీసుకున్నా. అప్పుడు కోన‌ వెంక‌ట్ గారు నన్ను సంప్రదించారు. హేమంత్ మధుకర్‌ గారితో ‘నిశ్శబ్దం’ కథను నరేట్‌ చేయించారు. ఆయన కథ చెప్పగానే విభిన్నంగా ఉంది అనిపించింది. అంతేకాదు సినిమాకు వర్కౌట్‌ అవుతుందనే నమ్మకం నాలో ఏర్పడింది. ఆ కారణంతోనే ఈ సినిమాకు సంతకం చేశా. నిజానికి అనుకోకుండా నా వద్దకు వచ్చిన కథ ఇది’.

ఒప్పుకోవడానికి కారణం అదే..
‘‘నిశ్శబ్దం’లో నా పాత్రకు మాటలు లేవు. వినికిడి లోపం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని హేమంత్‌ ముందుగానే చెప్పారు. నేను ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం కూడా నా పాత్ర ప్రత్యేకతే. దీని కోసం నేను కొన్ని రోజులు ఇండియ‌న్ సైన్ లాంగ్వెజ్ నేర్చుకున్నా. అయితే ఆ త‌ర్వాత షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లిన తర్వాత సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంద‌ని తెలిసింది. ఇంట‌ర్నేష‌న‌ల్‌గా అంద‌రూ ఎక్కువుగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే. దీంతో అమెరికాలో 14 ఏళ్ల అమ్మాయి ద‌గ్గర ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్‌లో శిక్షణ తీసుకున్నా’.

లోపం ఇదే..
‘సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయడం వల్ల ఓ సమస్య ఉంది. థియేటర్‌లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. కానీ ఓటీటీలో దాన్ని మిస్‌ అవుతారు. అయితే.. హెడ్ ఫోన్స్, హోమ్ థియేట‌ర్లు ఈ లోపాన్ని దాదాపు క‌వ‌ర్ చేస్తాయి. ‘నిశ్శబ్దం’కు సంగీతం ప్రధాన బలం. గోపీ సుంద‌ర్ ఇచ్చిన బాణీలు సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేశాయి’.

ఎంజాయ్‌ చేస్తారు..
‘నా కెరీర్ తొలినాళ్లలో మాధ‌వ‌న్ గారితో కలిసి న‌టించా. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత క‌లిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మేమిద్దరం ఈ చిత్రంలో సవాలుతో కూడుకున్న పాత్రలు చేశాం. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. కేవలం ఇద్దరి చుట్టూ తిరిగే కథ ఇది కాదు. స్క్రీన్‌ప్లేను ముందుకు న‌డిపించ‌డంలో మిగిలిన పాత్రలు కూడా కీల‌కంగా మారుతుంటాయి. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తార‌ని క‌చ్చితంగా చెప్పగల‌ను’.

మార్పు అవసరం..
‘ఓటీటీ, థియేట‌ర్.. రెండు వేర్వేరు. పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీలో చిత్రాల్ని విడుదల చేయడాన్ని కూడా ప్రజలు స్వాగతించాలి. కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే.. సాంకేతికంగా ప్రేక్షకులకు వినోదం పంచడం అవసరం. మొదటిసారి నేను న‌టించిన సినిమా ఇలా ఓటీటీలో విడుదల కాబోతుండటం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. మా ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా స్వాగతిస్తారని ఆశిస్తున్నా’.

ధైర్యం కావాలి..
‘హేమంత్ పూర్తి క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. తనకు కావాల్సిన దాన్ని నటుల నుంచి రాబట్టుకుంటాడు. అది ఆయన ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రయోగాత్మక కథను అమెరికా నేపథ్యంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అది అంత సులభం కాదు. దానికి ప్యాషన్‌, ధైర్యం కావాలి. అక్టోబరు 2న సినిమా విడుదలౌతోంది. మీరంతా దాన్ని చూసి, ఆదరించాలని కోరుకుంటున్నా’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని