ఐటెమ్‌ సాంగుల్లోకి.. మాస్‌ గుండెల్లోకి

చిత్ర విజయంలో ప్రత్యేక గీతానికి ఓ స్థానముంటుంది. రెండుమూడు గంటల చిత్రంతో లభించే గుర్తింపు,  పారితోషకం ఐదారు నిమిషాల ఐటెమ్‌ పాట తెచ్చిపెడుతోందనేది నేటి కథానాయికల మాట. అందుకే అగ్ర కథానాయికలూ....

Published : 13 Dec 2020 13:22 IST

చిత్ర విజయంలో ప్రత్యేక గీతానికి ఓ స్థానముంటుంది. రెండుమూడు గంటల చిత్రంతో లభించే గుర్తింపు,  పారితోషకం ఐదారు నిమిషాల ఐటెమ్‌ పాట తెచ్చిపెడుతోందనేది నేటి కథానాయికల మాట. అందుకే అగ్ర కథానాయికలూ వీటికి సై అంటుంటారు. తమ అందం, నృత్యంతో కనువిందు చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది నాయికగా కొనసాగుతూనే స్పెషల్‌ సాంగ్‌లో నర్తించి మెప్పించారు. మేము సైతం అంటూ ఇప్పుడా జాబితాలోకి మరికొందరు చేరుతున్నారు.

‘శివ మనసులో శ్రుతి’ అంటూ తొలి చూపులోనే అందరిని కట్టిపడేసింది రెజీనా కసాండ్రా. ఓ వైపు ప్రేమ కథా చిత్రాలు, మరో వైపు థ్రిల్లర్‌ సినిమాలు చేస్తూ అగ్ర కథా   నాయకుడు చిరంజీవి పక్కన చిందేసే అవకాశం అందుకుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో వేడుక నేపథ్యంలో వచ్చే గీతంలో నర్తించింది. రెజీనా తన అందంతో వేడిక్కించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను 2021 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో తొలిసారి..

బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌటేలాకు ప్రత్యేక గీతాలు కొత్తేమీ కాదు. హిందీ, బెంగాలీ చిత్రాల్లోని ఐటెం పాటలకు నర్తించిన ఊర్వశి ‘బ్లాక్‌ రోజ్‌’తో తెలుగు టాలీవుడ్‌కి పరిచయం కాబోతుంది. మోహన్‌ భరద్వాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అనే పాటకు స్టెప్పులేసి కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్‌ కథానాయకుడుగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో ప్రత్యేక గీతం కోసం చేస్తున్న అన్వేషణలో ఈమె పేరు వినిపిస్తోంది.

‘భూమ్‌ బద్దల్‌’ చేసేలా..

రవితేజ కథానాయకుడుగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ‘క్రాక్‌’లో అవకాశం అందుకుంది అప్సర రాణి. ‘భూమ్‌ బద్దల్‌’ అనే పాటలో రవితేజతో చిందులేసిందీ అమ్మడు. ఈ పాట ఇప్పటికే 10మిలియన్‌ వ్యూస్‌ దాటేసింది. కెరీర్‌   ఆరంభంలో ‘4 లెటర్స్‌’, ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రాల్లో నటించింది. రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన ‘థ్రిల్లర్‌’ వెబ్‌ సిరీస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూనే తొలిసారి ఐటెమ్‌ గీతంలో ఆడిపాడింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలచేయాలని ఉన్నారు.

‘హీట్‌ పెంచేందుకు’...

‘అలా ఎలా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా పటేల్‌ ‘కుమారి 21 ఎఫ్‌’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యువతలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘రెడ్‌’ చిత్రంలోని ‘డిచక్‌ డిచక్‌’ అనే హుషారెత్తించే గీతంలో నర్తించింది. యువ కథానాయకుడు రామ్‌తో కలిసి స్టెప్పులేసి పల్స్‌ రేట్‌ పెంచేస్తుందని అభిమానులంటున్నారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 సంక్రాంతికి రాబోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని