
ఇటలీలో ఇబ్బందిపడ్డాం: పూజాహెగ్డే
‘రాధేశ్యామ్’ షూటింగ్ గురించి పెదవి విప్పిన నటి
హైదరాబాద్: ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్-పూజాహెగ్డేపై పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ గురించి తాజాగా పూజాహెగ్డే స్పందించారు. కరోనా వైరస్ కారణంగా అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌లో పాల్గొంటున్నామని వివరించారు.
‘ఇటలీలో చిన్న సెట్ వేసుకుని.. అతి తక్కువ మంది బృందంతో జాగ్రత్తలు పాటిస్తూ షూట్ చేస్తున్నాం. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాం. సెట్‌లో ఉన్నంతసేపు మాస్క్ ధరిస్తున్నాం. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీస్తున్నాం. ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. షూట్ ప్రారంభించిన మొదటి రెండు రోజులు భయం, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది’ అని ఆమె అన్నారు.
అనంతరం ‘రాధేశ్యామ్’లో తాను ద్విపాత్రాభినయం చేయడం లేదని పూజా వెల్లడించారు. ‘‘పురాణాల్లో చూపించిన ‘రాధ’ పాత్రను పోషిస్తున్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాది ఆ పాత్ర కాదు. కాకపోతే.. చారిత్రాత్మకమైన ప్రేమికులే మాకు స్ఫూర్తి. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేయడం లేదు. మునుప్పెన్నడూ లేనివిధంగా నాలో టాలెంట్ బయటపెట్టేందుకు మంచి అవకాశం దొరికింది. ఇటీవల నా పుట్టినరోజున (అక్టోబర్ 13) ఓ భావోద్వేగభరితమైన సన్నివేశాన్ని చిత్రీకరించారు’ అని పూజాహెగ్డే వివరించారు.