
అభిమానులూ... మొక్కలు నాటండి
తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలంటూ అభిమానుల్ని అభ్యర్థించారు కథానాయకుడు మహేష్‌బాబు. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘‘నాపై ప్రేమని చూపిస్తూ అభిమానులు ప్రతిసారీ చేసే పనులపై నేనెంతో వినమ్రంగా ఉన్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్దతుగా ఈసారి మూడు మొక్కలు నాటి, ఆ పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో నాతో పంచుకోండి. వాటిని నేనూ చూస్తా’’ అంటూ వ్యాఖ్య చేశారు మహేష్. ఆయన పిలుపుపై హర్షం వ్యక్తం చేశారు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. ‘‘ప్రముఖ కథానాయకుడైన మహేష్‌కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారిచ్చిన ఈ పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనం. మహేష్ పేరుతో నాటే మొక్కలు వృక్షాలుగా పెరిగి ఎందరికో నీడనివ్వాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు జోగినిపల్లి సంతోష్‌కుమార్.