Anushka Sharma: పన్ను వ్యవహారం..కోర్టు మెట్లెక్కిన అనుష్క శర్మ

అమ్మకపు పన్ను వ్యవహారంపై ప్రముఖ నటి అనుష్క శర్మ కోర్టును ఆశ్రయించారు. తనపై ఎక్కువ పన్ను భారం మోపారంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 12 Jan 2023 21:31 IST

ముంబయి: భారత్‌ క్రికెట్‌జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka sharma) కోర్టు మెట్లెక్కారు. 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు సంబందించి బకాయి పడిన అమ్మకపు పున్ను (Sales Tax) చెల్లించాలంటూ డిప్యూటీ కమిషనర్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ బొంబాయి హైకోర్టు (Bombay Highcourt)లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ నితిన్‌ జమ్‌దార్‌, జస్టిస్‌ అభయ్‌ ఆహుజాల ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.

సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులు పంపిన నోటీసులను రద్దు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని అనుష్క శర్మ కోర్టును అభ్యర్థించారు. నటీనటులకు వర్తించే పన్నుల శ్లాబులనే తనకు వర్తింపజేయాలని, అలా కాకుండా అధికారులు అదనపు పన్నులు చెల్లించాలంటూ నోటీసులు పంపారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే అంశంపై  2012-2016 మధ్య కాలంలో అనుష్కశర్మ బొంబాయి హైకోర్టులో 4 పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా గత వారం మరో పిటిషన్‌ వేశారు.

వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు నటిగా సినిమాలతోపాటు, కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె ప్రశ్నించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.1.2 కోట్లు, 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 కోట్లు పన్ను చెల్లించాల్సిందిగా సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఉత్పత్తులు (వీడియోలు) విక్రయించినట్లు సరైన నిర్ధారణ లేకుండా పన్నులు ఎలా విధిస్తారని? ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఎవరైనా నటిస్తే వాళ్లు నటులు మాత్రమే అవుతారని, నిర్మాతలు కాబోరని ఆమె తెలిపారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని