Jyothika: సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్‌ హీరానందానీ

‘శ్రీకాంత్‌’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు.

Published : 26 Apr 2024 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీకాంత్‌’. బాలీవుడ్‌ స్టార్ రాజ్‌కుమార్‌రావ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి తుషార్‌ హీరానందానీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటి జ్యోతిక కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. జ్యోతికను ఈ పాత్ర కోసం సూర్యనే ఒప్పించినట్లు తెలిపారు.

‘నేను జ్యోతిక నటించిన చాలా దక్షిణాది సినిమాలు చూశాను. ముఖ్యంగా తమిళ సినిమాల్లో ఆమె నటన అద్భుతం. గొప్ప నటి. ‘శ్రీకాంత్’ చిత్రంలో టీచర్‌ పాత్రకు ఆమె అయితే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఆమెను సంప్రదించినప్పుడు మొదట అంగీకరించలేదు. తర్వాత రోజు స్వయంగా ఆమె ఫోన్‌ చేసి.. సినిమాను ఓకే చేసినట్లు చెప్పారు. సూర్య స్క్రిప్ట్‌ చదివారని.. ఇంత మంచి కథను వదులుకోవద్దని చెప్పినట్లు తెలిపారు. నన్ను వాళ్ల ఇంటికి పిలిచి సినిమాను అంగీకరించినట్లు ధ్రువీకరించారు. ఎంతో ఆనందించాను. ఈ చిత్రం కోసం రాజ్‌ కుమార్, జ్యోతిక తొలిసారి కలిసి నటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీమణులతో ఆయన స్క్రీన్‌ పంచుకున్నారు. అందుకే జ్యోతికతో అయితే బాగుంటుందని ఆవిడ నటించాలని కోరుకున్నాం. గతంలో ఆమె నటించిన తొలి హిందీ చిత్రం కూడా మాదే అవడం విశేషం. మళ్లీ ఇన్ని రోజులకు ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది’ అని తుషార్‌ హీరానందానీ తెలిపారు. ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని