Kiara Advani: సిద్ధార్థ్‌ ప్రైవేట్‌ పర్సన్‌.. పెళ్లి వీడియో పోస్ట్‌పైనా చర్చ: కియారా

పెళ్లి ఫొటోలు/వీడియోల పోస్టింగ్‌పై తమ మధ్య చోటుచేసుకున్న చర్చలను కియారా అడ్వాణీ గుర్తు చేసుకుంది. తన భర్త గురించి ఆమె చెప్పిందంటే?

Published : 12 Jul 2023 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) ప్రైవేట్‌ పర్సన్‌ అని, వ్యక్తిగత విషయాలకు సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టేందుకు ఆసక్తి చూపించడని నటి కియారా అడ్వాణీ (Kiara Advani) తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన భర్త గురించి మాట్లాడింది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు/వీడియోలను అభిమానులతో పంచుకోవాలా, వద్దా? అని చాలాసేపు చర్చించుకున్నామని పేర్కొంది. పెళ్లయ్యాక ఇరువురు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసిన వీడియో విషయంలోనూ డిబేట్‌ సాగిందని గుర్తుచేసుకుంది. మరోవైపు, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్‌ తన సతీమణిపై ప్రశంసలు కురిపించాడు. కియారా తనకు అత్యంత విలువైన నిధి అని, తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుస్తోందని తెలిపాడు.

‘షేర్షా’ (Shershaah) సినిమాతో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్‌, కియారా ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. జైసల్మేర్‌ (రాజస్థాన్‌)లోని సూర్యఘర్‌ ప్యాలస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ  కెరీర్‌ విషయానికొస్తే.. కార్తిక్‌ ఆర్యన్‌ సరసన కియారా నటించిన ‘సత్య ప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha) ఇటీవల విడుదలై, మంచి విజయం అందుకుంది. రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం ఆమె ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)లో నటిస్తోంది. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) తెరకెక్కిస్తున్న చిత్రమిది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్‌ నటించిన ‘యోధ’ సినిమా సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force) వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని