ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల

హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన అలనాటి నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.....

Published : 17 May 2021 12:04 IST

హైదరాబాద్‌: హాస్యనటి, సహాయనటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైన అలనాటి నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె నగరంలో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని కష్టంగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా, తన ఆర్థిక ఇబ్బందులు గురించి శ్యామల మాట్లాడుతూ.. ‘‘స్టేజీ ఆర్టిస్ట్‌గా 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో సన్మానాలు, సత్కరాలు అందుకున్నాను. అనారోగ్యం కారణంగా సినీ పరిశ్రమకు దూరమయ్యాను. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను, నా కుమార్తె ఇద్దరం అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నా ఆర్థిక సమస్యలు తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి రూ.2 లక్షలు పంపించారు. ‘గబ్బర్‌సింగ్‌’ సమయంలో పవన్‌ కూడా నాకు సాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినెలా నాకు వచ్చే ఫించన్‌ సైతం మూడు నెలల నుంచి రావడం లేదు. ఇప్పుడు ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. నాకు వచ్చిన అవార్డుల్లో కొన్నింటిని అమ్మేసి.. ఆ డబ్బుతో ఇంటి అద్దె కట్టాను’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో నటి శ్యామలకు ప్రతిఒక్కరూ చేతనైనంత సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు.

‘ఛాలెంజ్‌’, ‘స్వర్ణకమలం’, ‘సుస్వాగతం’, ‘మనసంతా నువ్వే’, ‘ఖడ్గం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘వర్షం’, ‘ఆంధ్రావాలా’, ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’, ‘గోలీమార్‌’ వంటి పలు చిత్రాల్లో శ్యామల తన నటనతో మెప్పించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని