Mangalavaram: అలాంటి సన్నివేశాలు నా జీవితంలో తీయను!

‘‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్‌ భూపతి. ఈ సినిమాతోనే నటిగా పాయల్‌ రాజ్‌పూత్‌ కూడా అందరి మన్ననలు అందుకుంది.

Updated : 14 Nov 2023 14:37 IST

‘‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు అజయ్‌ భూపతి. ఈ సినిమాతోనే నటిగా పాయల్‌ రాజ్‌పూత్‌ కూడా అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడీ విజయవంతమైన కాంబినేషన్‌లో ‘మంగళవారం’ అనే పాన్‌ ఇండియా సినిమా సిద్ధమైంది. ఇది ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం విలేకర్లతో ముచ్చటించారు అజయ్‌ భూపతి.

  • ‘‘మహాసముద్రం’ మొదలు పెడుతున్నప్పుడే నా తదుపరి చిత్రంగా ఈ ‘మంగళవారం’ను పట్టాలెక్కించాలని అనుకున్నా. ఈ కథను నేను ఎప్పుడో రాసుకున్నా. నా గత రెండు చిత్రాల కన్నా ఇదెంతో ప్రత్యేకం. ఇలాంటి అంశాన్ని ఇంత వరకు ఎవరూ టచ్‌ చేయలేదు. దీంట్లో మంచి వాణిజ్యాంశాలున్నాయి.
  • సినిమా ముగింపు మరోస్థాయిలో ఉంటుంది. చివరి 45నిమిషాల్లో వచ్చే ట్విస్ట్‌లు ఆశ్చర్యపరుస్తాయి. అలాగే సాంకేతికంగానూ ఈ చిత్రం చాలా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి ఇలాంటి కొత్త తరహా కథలు, జానర్లు ప్రయత్నిస్తున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు’’.
  • ‘‘ఈ చిత్రంలో పాయల్‌ పాత్ర చూసి అందరూ షాకవుతారు. అలాగే ఆ పాత్ర భావోద్వేగభరితంగానూ ఉంటుంది. అయ్యో అనుకొని ప్రేక్షకులు బాధపడేలా చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారు. పాయల్‌ తన జీవితంలో మళ్లీ ఇలాంటి పాత్ర చేయలేదేమో అనిపించేంత అద్భుతమైన నటన కనబర్చింది. దీంట్లో అసభ్యకర సన్నివేశాలేమీ ఉండవు. నేను నా జీవితంలో అలాంటి సీన్స్‌ తీయను’’.
  • ‘‘మంగళవారం అంటే కొందరు చెడ్డరోజుగా చూస్తారు కానీ.. అది శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజే సెలవు ఉండేది. బ్రిటీషర్లు వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేయగానే పెద్ద వంశీ ఫోన్‌ చేశారు. ‘మంచి టైటిల్‌ అజయ్‌. నేను చాలా సార్లు ఆ పేరు పెడదామంటే నిర్మాతలు ఒప్పుకోలేద’న్నారు. అలా ఆయన నుంచి నాకు ఫోన్‌ రావడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు కొనసాగింపు ఉంటుంది. సీక్వెల్‌, ప్రీక్వెల్‌, ఫ్రాంచైజీ.. దాన్ని ఏం అంటారో నాకైతే తెలియదు. కచ్చితంగా ఇదైతే కొనసాగుతుంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని