Thunivu: సంక్రాంతి బరిలో అజిత్‌ సినిమా

విజయ్‌ ‘వారిసు’, అజిత్‌ ‘తునివు’ చిత్రాలు సంక్రాంతి బరిలో తలపడనున్నాయి. ‘వారిసు’ విడుదల ఇప్పటికే ఖరారవ్వగా.. శుక్రవారం ‘తునివు’ సినిమాపై స్పష్టత వచ్చింది.

Updated : 29 Oct 2022 08:34 IST

విజయ్‌ ‘వారిసు’, అజిత్‌ (Ajith) ‘తునివు’ (Thunivu) చిత్రాలు సంక్రాంతి బరిలో తలపడనున్నాయి. ‘వారిసు’ విడుదల ఇప్పటికే ఖరారవ్వగా.. శుక్రవారం ‘తునివు’ సినిమాపై స్పష్టత వచ్చింది. దీన్ని ముగ్గుల పండక్కే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘నెర్కొండ పార్వాయి’, ‘వలిమై’ సినిమాల తర్వాత అజిత్‌, వినోద్‌ల కలయికలో వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.


పోరు మరింత రసవత్తరంగా.. 

కొన్నేళ్లుగా ప్రతి సంక్రాంతికీ తెలుగు సినిమాలతో పాటు ఒక్కటైనా అనువాద చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఈ అనువాద చిత్రాల సందడి రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్‌ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా విడుదల కానుంది. ఇక అజిత్‌ కూడా కొన్నాళ్లుగా తన సినిమాల్ని తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘తునివు’ విషయంలోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇదే జరిగితే ఈసారి టాలీవుడ్‌లో సంక్రాంతి రేసు మరింత రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అఖిల్‌ ‘ఏజెంట్‌’ చిత్రాలు పెద్ద పండగ బరిలో పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలోకి ‘వారసుడు’, ‘తునివు’ చిత్రాలు కూడా చేరి సంక్రాంతి పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే పండగ బరిలో ఇన్ని చిత్రాలకు అవకాశం ఉంటుందా? విడుదల తేదీల్ని ఎలా పంచుకుంటారు? అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని