Ranbir Kapoor: అలియానే ధైర్యం చెప్పేది

‘‘యానిమల్‌’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఆ సమయంలో నా భార్య అలియా భట్‌ నాకు ధైర్యం చెప్పింది’ అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌.

Updated : 30 Nov 2023 06:40 IST

‘‘యానిమల్‌’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా భయపడ్డా. ఆ సమయంలో నా భార్య అలియా భట్‌ నాకు ధైర్యం చెప్పింది’ అంటున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఈ ప్రాజెక్టు ప్రకటించిన దగ్గర్నుంచీ.. అటు పరిశ్రమవర్గాల్లో, ఇటు అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌ లుక్‌, ట్రైలర్‌లో కనిపించిన నటనపై సైతం ప్రశంసలు కురుస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరవుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ బుధవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ‘మేం చేస్తున్న ప్రతి సినిమా, అందులోని పాత్రల గురించి అలియా, నేను బాగా చర్చించుకుంటాం. ఒక ఆర్టిస్టుగా ఆమె అభిప్రాయాన్ని ఎంతో గౌరవిస్తా. ‘యానిమల్‌’ చేసేటప్పుడు కొన్ని సీన్లు తప్పుగా అనిపించేవి. కొన్నింట్లో అయితే బాగా భయపడ్డా. ఆ సమయంలో ‘నువ్వు చేస్తోంది సినిమాలోని ఒక పాత్ర మాత్రమే. అది నీ వ్యక్తిగతం కాదు. ఆ పాత్ర చిత్రీకరణ వెనక చాలా ఆలోచనలు, అంశాలుంటాయి. అలాంటప్పుడు భయపడాల్సిన అవసరమేంటి’ అంటూ తను పాత్రకు సన్నద్ధం చేసేది’ అంటూ ఆసక్తికర సంగతి వెల్లడించారు రణ్‌బీర్‌. ఈ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని