pushpa: Pushpa: ‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ వెనుక హరీశ్‌ శంకర్‌

Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ వెనుక దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఉన్నారు.

Published : 08 May 2024 13:19 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa: The rule) రాబోతోంది. తొలి భాగంలో ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే డైలాగ్‌ అభిమానులతో విజిల్స్‌ వేయించింది. మంగళం శ్రీను ఇంటికి వెళ్లిన పుష్పరాజ్‌ తానే నేరుగా సరకు మురుగన్‌కు అమ్ముతానంటూ చెప్పేసి వస్తుంటాడు. దీంతో తన మనుషులతో పుష్పపై దాడి చేయిస్తాడు మంగళం శ్రీను. వారందరినీ చితగొట్టి గన్‌ పట్టుకుని ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు.. ఫైరు..’ అంటూ బన్నీ డైలాగ్‌ చెప్పే సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈ డైలాగ్‌ పెట్టడం వెనుక దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఉన్నారు.

తొలుత అనుకున్న స్క్రిప్ట్‌లో ఈ డైలాగ్‌ లేదు. ‘పుష్ప’ షూటింగ్‌ జరుగుతుండగా ఒకరోజు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ వచ్చి బన్నిని కలిశారు. మాటల సందర్భంలో ‘‘ఇంత మాస్‌ సినిమా తీస్తూ, క్లాస్‌గా ‘పుష్ప’ అని పెట్టడం బాగోలేదు డార్లింగ్‌’’ అని చెప్పడంతో ఇదే విషయాన్ని సుకుమార్‌ దగ్గర ప్రస్తావించారు. తన సినిమాలోని ప్రతి సీన్‌ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకునే సుకుమార్‌, టైటిల్‌ విషయంలో అంతే క్లారిటీగా ఉందామని బన్నికి చెప్పారు. అప్పటికప్పుడు ‘పుష్ప అంటే ఫ్లవర్‌ కాదు.. ఫైరు’ అనే డైలాగ్‌ రాసి సినిమాలో పెట్టారు. ఆ తర్వాత ఆ డైలాగ్‌ విపరీతంగా వైరల్‌ అయింది. ప్రస్తుతం ‘పుష్ప2’ (Pushpa 2: The Rule) షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ‘పుష్ప.. పుష్ప..’ సాంగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అంందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని