Allu Arjun: ఆయన లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేదికాదు: అల్లు అర్జున్‌

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ ‘18 పేజెస్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిఖిల్‌, అనుపమ జంటగా తెరకెక్కిన చిత్రమిది.

Updated : 19 Dec 2022 23:15 IST

హైదరాబాద్‌: నిఖిల్‌ (Nikhil) హీరోగా దర్శకుడు సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్‌’ (18 Pages). అనుపమ పరమేశ్వరన్‌ (Anupama) కథానాయిక. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్‌ లేకపోతే నా లైఫ్‌ ఇలా ఉండేదికాదని నేనెప్పుడూ అనుకుంటుంటా. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. నాకు బాగా కావాల్సిన వారంతా కలిసి తీసిన సినిమా ఇది. సొంత ఓటీటీ ఉన్నా థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలనుకునే నిర్మాత, మా నాన్నను నేను గౌరవిస్తా. గోపీ సుందర్ సంగీతం నాకు బాగా ఇష్టం. ఈ సినిమాకీ ఆయన మంచి స్వరాలు సమకూర్చారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందనుకుంటున్నా. సూర్య ప్రతాప్‌ను ‘ఆర్య’ సినిమా నుంచి చూస్తున్నా. ఆలస్యమైనా మంచి చిత్రాలనే తీయాలనుకుంటారాయన. ‘హ్యాపీడేస్‌’ సినిమా నుంచి నిఖిల్‌ను పరిశీలిస్తున్నా. ‘ఇంత మంచి స్క్రిప్టులు ఎలా ఎంపిక చేసుకుంటావ్‌?’ అని అతణ్ని ఓసారి అడిగా. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని, నచ్చుతుందని ఆశిస్తున్నా. సుకుమార్‌ ప్రొడ్యూస్‌ చేస్తే 18 పేజెస్‌.. అదే ఆయన డైరెక్షన్‌ చేస్తే 118 పేజెస్‌ (నవ్వులు). ‘పుష్ప 2’.. అసలు తగ్గేదే లే’’ అని అల్లు అర్జున్‌ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

ఆ దారిలోనే ప్రయాణించాం: నిఖిల్‌

‘‘ఈ ఏడాది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నటించిన ఓ సినిమా విజయం అందుకుంది. ఇప్పుడు  ఇంకోటి విడుదలవుతోంది. దానికి అల్లు అర్జున్‌ గెస్ట్‌గా రావడాన్ని మర్చిపోలేను. దర్శకులు రాజమౌళి, సుకుమార్‌ పాన్‌ ఇండియా చిత్రాలకు దారి వేశారు. ఆ స్ఫూర్తితోనే ‘కార్తికేయ 2’ను తీసుకొచ్చాం. సుకుమార్‌ రాసిన కథ (18 పేజెస్‌)లో నేను నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు సూర్య ప్రతాప్‌ ఓ పాపలా ఈ చిత్రాన్ని చూసుకున్నారు’’ అని నిఖిల్‌ అన్నారు.

ఆ క్రెడిట్‌ తనదే: సుకుమార్‌

‘‘గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను నిర్మాతకావాలని ‘జగడం’ సినిమా సమయంలో అనుకున్నా. అప్పుడు నిఖిల్‌కు అడ్వాన్స్‌ కూడా ఇచ్చా. ఆయన ఇంకా మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. దర్శకుడు ప్రతాప్‌ నా సోదరుడులాంటివాడు. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పుష్ప 2’.. ఇలా నా సినిమాల్లో తను ఓ భాగం. నేను ఓ పాయింట్ చెబితే దాన్ని డెవలెప్‌ చేస్తాడు. క్రెడిట్‌ నాకు ఇస్తున్నాడు. ఈ 18 పేజెస్‌తో సుమారు మూడేళ్ల నుంచి ప్రయాణించాడు. ‘రంగస్థలం’లో అనుపమ పరమేశ్వరన్‌ నటించాల్సింది. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం’’ అని సుకుమార్‌ (Sukumar) తెలిపారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని