Balakrishna: అభిమానులకు ఈ రోజు నుంచీ సంక్రాంతే

‘‘ఎన్నో రకాలు సినిమాలు చేశాను. ఇంకా కసి తీరలేదు’’ అన్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). మరింతగా శ్రమించాలనే తపన, ప్రేక్షకులకు కొత్తదనం అందించాలనే తాపత్రయం నాన్న నందమూరి తారక రామారావు (NTR) నుంచి నేర్చుకున్నవే’’అని పేర్కొన్నారు.

Updated : 07 Jan 2023 10:42 IST

- వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌ వేడుకలో బాలకృష్ణ

‘‘ఎన్నో రకాలు సినిమాలు చేశాను. ఇంకా కసి తీరలేదు’’ అన్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). మరింతగా శ్రమించాలనే తపన, ప్రేక్షకులకు కొత్తదనం అందించాలనే తాపత్రయం నాన్న నందమూరి తారక రామారావు నుంచి నేర్చుకున్నవే’’అని పేర్కొన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. గోపీచంద్‌ మలినేని (Gopichand Manlineni) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఒంగోలులో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడికి శత జయంతి అభినందనలు. ప్రపంచంలో ఎక్కడ వెదికినా అటువంటి నటుడు, ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అణువణువునూ నింపుకున్న ధీరుడు మరెక్కడా లేరు. అది నేనే కాదు, ఏ నటుడైనా ఒప్పుకోక తప్పదు. అభిమానులకి ఈ రోజు నుంచే సంక్రాంతి పండగ మొదలైంది.  ఈ వేడుకకి పెద్దరికాన్ని తీసుకొచ్చారు దర్శకుడు బి.గోపాల్‌. ఆయనతో చేసిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. నా జీవితాశయం చెంఘీజ్‌ఖాన్‌ సినిమా. కచ్చితంగా చేస్తా. దేనికైనా సమయం రావాలి. అభిమానుల్ని పొందడం జన్మజన్మల బంధం అనిపిస్తుంది. అది డబ్బుతో కొనేది కాదు. ఎటువంటి ప్రలోభాలకి లోను కానిది. ఒంగోలుకే చెందిన  మా దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా నా అభిమానే. ఆయనతో ఇంత గొప్ప సినిమా చేయడం గర్వంగా ఉంది. అందరి ప్రేమాభిమానాల్ని అపూర్వంగా అనురాగంగా మనసు పరిచే వ్యక్తిత్వం నాది. సినిమాలకి, రాజకీయాలకే పరిమితం అనుకున్నవాళ్లకి ఓటీటీ  వేదికతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాను. అన్‌స్టాపబుల్‌  ప్రపంచంలోనే టాక్‌ షోలకి దీటుగా నిలిచింది. ఇప్పుడు ఫ్యాక్షన్‌ ఎందుకు అంటారేమో. కానీ దీని వెనక రామాయణం మహాభారతంలాంటి చాలా కథలు ఉన్నాయి. ఆదిత్య 369, భైరవద్వీపం తదితర చిత్రాల్లాగా చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ఒకటిగా నిలవబోతోంది ‘వీరసింహారెడ్డి’. నటనలో విశ్వరూపం, వేషధారణలో దశావతారం, మాలాంటి నటులందరికీ మార్గదర్శకమైన కమల్‌హాసన్‌ అమ్మాయి శ్రుతి. ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌ డీఎన్‌ఏలు ఈ సినిమాకోసం కలిశాయి. కామెడీ, టైమింగ్‌ కలగలిసిన నటి ఆమె. స్వయంకృషితో ఎదిగింది. హనీరోజ్‌కి తెలుగులో మొదటి సినిమానే అయినా, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన విధానం అద్భుతం. దునియా విజయ్‌ అద్భుతమైన పాత్ర చేశారు. కన్నడ, తెలుగు మైత్రికి చిహ్నంలా విజయ్‌ నిలిచారు. ఎలాంటి సినిమాలు తీయాలో తెలిసిన నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌. అద్భుతమైన బృందంతోకలిసి పనిచేశారు. ఈ సినిమా బాగా ఆడి తీరుతుంది’’ అన్నారు.

* బి.గోపాల్‌ మాట్లాడుతూ ‘‘నాకు ఎన్టీఆర్‌ ఓ దేవుడు. మహా అందగాళ్లకే అందగాడు ఆయన.  అలాంటి అందగాడికి పుట్టిన నందమూరి అందగాడు బాలకృష్ణ. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన నటుడు. లారీ డ్రైవర్‌, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు... ఇలా ఆయనతో నేను చేసిన అన్నీ  సూపర్‌ హిట్‌ సినిమాలే. వీరసింహారెడ్డి పేరు, అందులో  బాలకృష్ణ లుక్‌, ఆయన పవర్‌ చూస్తే ఆనందం కలుగుతుంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.

* శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ ‘‘మైత్రీ సంస్థలో ఇది నా మూడో చిత్రం. నా కుటుంబ నిర్మాణ సంస్థ అయ్యింది. దర్శకుడు గోపీచంద్‌తో కూడా నాకు ఇది మూడో చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో నాకున్న ఓ అన్నయ్య ఆయన. బాలయ్య నిజమైన సింహం. బంగారంలాంటి హృదయం ఆయనది. కలిసి నటించడం గొప్ప అనుభవం’’ అన్నారు.

* నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘‘పరిశ్రమకి వచ్చి ఎనిమిదేళ్లయింది. బాలకృష్ణతో సినిమా ఇప్పటికి కుదిరింది’’ అన్నారు.

* వై.రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు బాలకృష్ణకి కృతజ్ఞతలు. శ్రుతిహాసన్‌ తొలి సినిమాలో ఎంత అందంగా ఉన్నారో, దానికి మించి ఉన్నారు. అభిమానులు ఎంత ఊహించుకున్నా, దాన్ని మించి ఉండబోతోంది ఈ సినిమా. అమెరికాలో ఉన్న అభిమానులు కూడా  పండగకి వస్తున్న రెండు సినిమాల్నీ చూసి  ఆస్వాదించాలి’’ అన్నారు.

* గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ‘‘1999లో ఒంగోలులో ‘సమరసింహారెడ్డి’ చూడాలని 20 మంది మిత్రులతో కలిసి సైకిల్‌పై వచ్చా. ఓ అభిమానిలాగే ఆ సినిమా కోసం వచ్చా. కానీ అక్కడ గొడవ జరిగితే తీసుకెళ్లి లోపలేశారు. ఆ రోజు రాత్రి షో చూసి పడుకున్నాకే ప్రశాంతత కలిగింది. బాలయ్య బాబు అభిమాని ఆయన సినిమాని తెరకెక్కిస్తున్నాడంటే జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? జీవితంలో ఇలాంటి అవకాశం రావడం మామూలు విషయం కాదు. పనిచేస్తున్న ప్రతి రోజూ ఓ కంటితో దర్శకుడిలా, రెండో కంటితో అభిమానిలా చూస్తూ సినిమాని తెరకెక్కించా. జీవితాంతం ఆ మధుర స్మృతులు ఉంటాయి. బాలకృష్ణతో సినిమా చేస్తున్నానంటే మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. శ్రుతిహాసన్‌ నాకు లక్కీ హీరోయిన్‌. తమన్‌ సంగీతం చేస్తూ ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పారు. గొప్ప సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పనిచేసింది. అభిమానులంతా కలిసి సినిమా చేస్తే.. అది ‘వీరసింహారెడ్డి’. పతాక సన్నివేశాలకి సంబంధించి యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్నప్పుడు సెట్లో ఆయన తపన చూసి ఆశ్చర్యపోయా. జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ విజృంభిస్తాడు, అందరూ చూస్తార’’న్నారు. ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, చంద్రిక రవి, సప్తగిరి, అజయ్‌ ఘోష్‌, రామ్‌ లక్ష్మణ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని