Dil Raju: యానిమల్‌ తరహా చిత్రాల్ని మేమూ నిర్మిస్తాం

యానిమల్ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ కావడంతో తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

Updated : 03 Dec 2023 07:18 IST

యానిమల్‌ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ కావడంతో తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.15కోట్ల మేరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చాయని.. ఈ వారాంతంలోనే రూ.35కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు గ్రాస్‌ మార్క్‌ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘యానిమల్‌’. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా గ్లోబల్‌ అయ్యిందని చెప్పడానికి ఈ చిత్ర విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాల్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం అన్నారు. అనంతరం దిల్‌రాజు తమ బ్యానర్‌లో రూపొందుతోన్న కొత్త సినిమాల గురించి స్పందించారు. ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో నాలుగు సినిమాలు, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మూడు చిత్రాలు చేస్తున్నట్లు చెప్పారు. రామ్‌చరణ్‌  శంకర్‌ల కలయికలో నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న మహేష్‌బాబు గుంటూరు కారం, వెంకటేష్‌ సైంధవ్‌ చిత్రాల్ని నైజాంలో తనే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్రాంతికి రావాల్సిన విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీస్టార్ సినిమాని మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని