ఆస్కార్‌ అవార్డు అంటే ఏంటో తెలియదు.. ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ నటి బెల్లీ

అనాథ ఏనుగులను (Elephants) సంరక్షించే ఓ దంపతుల వాస్తవ జీవన ఆధారంగా రూపొందించిన భారతీయ లఘుచిత్రం (The Elephant Whisperers) ఆస్కార్‌ అవార్డు పొందింది. దీనిపై స్పందించిన ఆ చిత్రంలోని నటి బెల్లీ.. ఆస్కార్‌ అవార్డు అంటే ఏంటో తెలియదని, అయినప్పటికీ అభినందనలు వెల్లువెత్తడం సంతోషంగా ఉందని చెప్పారు.

Updated : 13 Mar 2023 16:26 IST

ఊటీ: దిక్కులేని ఏనుగులను (Elephants) ఆదరించి, వాటి సంరక్షణ చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘుచిత్రం (The Elephant Whisperers) ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు (Oscar 2023) పొంది యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇంత గొప్ప అవార్డు (95th Academy Awards) రావడంపై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో గర్వంగా భావిస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ లఘుచిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బెల్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, తనకు అసలు ఆస్కార్‌ అవార్డు అంటే తెలియదని.. అయినప్పటికీ అభినందనలు వెల్లువెత్తడం ఎంతో సంతోషంగా ఉందని బెల్లీ స్పందించారు. మరోవైపు.. ఈ లఘుచిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లడం గమనార్హం.

‘ఏనుగులు మాకు పిల్లలవంటివి. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి ఎన్నో గున్న ఏనుగులను చేరదీసి సంరక్షించాం. అలాంటి వాటిని మా సొంత పిల్లల్లాగే చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వికులు కూడా ఇదే పని (మావటి) చేసేవారు’ అని లఘుచిత్రంలో నటించిన బెల్లీ వెల్లడించారు. దీనికి ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం గురించి ప్రస్తావించగా.. ‘ఈ అవార్డు గురించి నాకు తెలియదు. కానీ, అభినందనలు వెల్లువెత్తడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక ఇందులో హీరోగా నటించిన ఆమె భర్త బొమ్మన్‌ గురించి అడగగా.. సమీప పట్టణంలో తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తెచ్చేందుకు వెళ్లారని, దానికి సేవలు చేసేందుకు ఎంతో ఉత్సాహంగా వేచిచూస్తున్నానని చెప్పడం విశేషం.

తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) అనే లఘుచిత్రం రూపొందింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే పాత్రలుగా ఈ కథ రూపుదిద్దుకుంది. నిర్మాత గునీత్‌ మోగ్న నేతృత్వంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్‌ ఈ కథను తెరకెక్కించారు. 42 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఆస్కార్‌ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని