Director Krish: దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే ఇష్టపడతా!

‘‘ప్రతి సినిమాకీ ఓ కొత్త అధ్యాయం ఉండాలనుకుంటా. చేస్తున్నది ఒకటే అనిపించకుండా..మరింత ఆసక్తికరంగా మరింత సాహసోపేతంగా అనిపిస్తే ఆ సినిమా ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఓ దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే నేను ఇష్టపడతా’’ అంటున్నారు క్రిష్‌ జాగర్లమూడి. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయన సినిమాల్లోని మాటలు, పాటలే ఆ విషయాన్ని

Updated : 05 Oct 2021 05:13 IST

‘‘ప్రతి సినిమాకీ ఓ కొత్త అధ్యాయం ఉండాలనుకుంటా. చేస్తున్నది ఒకటే అనిపించకుండా..మరింత ఆసక్తికరంగా మరింత సాహసోపేతంగా అనిపిస్తే ఆ సినిమా ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఓ దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే నేను ఇష్టపడతా’’ అంటున్నారు క్రిష్‌ జాగర్లమూడి. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయన సినిమాల్లోని మాటలు, పాటలే ఆ విషయాన్ని చాటి చెబుతుంటాయి. తాజాగా ‘కొండపొలం’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ఆ చిత్రం ఈ నెల 8న రానుంది. ఈ సందర్భంగా క్రిష్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ఏ కథ చెప్పినా అంతర్లీనంగా మానవీయ విలువల గురించి చర్చించడం అలవాటు. నాకు ఎప్పట్నుంచో అడవులు, జంతువుల నేపథ్యంలో సినిమా చేయాలని ఉండేది. సాహసోపేతంగా సాగే అలాంటి సినిమాల్ని చూడటానికి స్వతహాగా నేను ఇష్టపడతాను. అందుకే వెంకటేష్‌తో ‘అతడు అడవిని జయించాడు’ నవలని ‘జంగిల్‌బుక్‌’ తరహాలో సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నా. కానీ హక్కులు దొరక్క అప్పట్లో కుదరలేదు. ‘కొండపొలం’ తీయడానికే ఆ సినిమాని చేయలేదేమో మరి! దర్శకులం అంతా అప్పుడప్పుడూ సమావేశం అవుతుంటాం. ఎవరేం చదివారో చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో మేమంతా కలిసినప్పుడు సుకుమార్‌, మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఇద్దరూ ఒకేసారి ‘కొండపొలం’, ‘శప్తభూమి’ నవలల గురించి చెప్పారు. మొదట ‘శప్తభూమి’, ఆ తర్వాత ‘కొండపొలం’ చదివాను. ఆసక్తికరంగా అనిపించాయి. ‘శప్తభూమి’ ఓ మంచి వెబ్‌ సిరీస్‌ అవుతుంది. దాని హక్కుల గురించి కూడా ప్రయత్నించాం కానీ దొరకలేదు. ‘కొండపొలం’ హక్కులు తీసుకున్నాక సుక్కు ఫోన్‌ చేస్తే ‘నేనే హక్కులు తీసుకున్నా, ఇలా చేయబోతున్నా’ అని చెప్పా’’.

* ‘‘పుస్తకాన్ని సినిమాకి అనుగుణంగా మలచడం ఒకెత్తైతే, దాన్ని అడవి నేపథ్యంలో తీయాలనుకోవడం మరో ఎత్తు. రెండూ నాలో ఆత్రుతని పెంచిన విషయాలే. అహోబిలం వెళుతున్నప్పుడు కొండలపై గొర్రెలు కనిపించేవి. చూడ్డానికి చాలా బాగుండేది ఆ దృశ్యం. ఈ నవల చదువుతున్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కళ్లముందు మెదిలాయి. కథని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చిక్కటి కథనంతో చాలా బాగా రాశారు. తెరలుతెరలుగా ఉత్కంఠని రేకెత్తిస్తుంటుంది కథ. సినిమాటిక్‌గా ఉన్న ఈ నవలని కాంతాసమేతంగా చెబితే బాగుంటుందనిపించింది. అలా పుట్టిందే ఓబులమ్మ పాత్ర. నా ‘గమ్యం’లో కూడా అంతర్లీనంగా ఓ ప్రేమకథ ఉంటుంది. అలా ఈ సినిమాకి ఓ అందమైన ప్రేమకథని జోడించాం. అలాగే సివిల్స్‌ విజేతల్ని దృష్టిలో పెట్టుకుని కథానాయకుడి పాత్రని తీర్చిదిద్దాం. రవీంద్రనాథ్‌ అనే ఓ కుర్రాడు తనలోని భయాల్ని జయించి బయటికి రావడానికి అడవి ఎలా దోహదం చేసిందనేది ఈ కథలో ఆసక్తికరం’’.

* ‘‘పవన్‌కల్యాణ్‌తో తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాకి పనిచేసిన బృందమే ఈ సినిమాకీ పనిచేసింది. కరోనాతో చిత్ర పరిశ్రమ అంతా స్తంభించి, లాక్‌డౌన్‌తో పనులు లేక అందరూ ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ విరామంలో ఓ సినిమా చేస్తే అందరికీ పని కల్పించినట్టు అవుతుందని అనుకున్నా. అదే విషయం పవన్‌కల్యాణ్‌కి చెబితే ఆయన నా ఆలోచనని అర్థం చేసుకుని ప్రోత్సహించారు. నిర్మాత ఎ.ఎం.రత్నం కూడా ఓకే చెప్పారు. అంతకుముందే నాకు సాయితేజ్‌ ‘ఉప్పెన’లోని నీ కళ్లు నీలి సముద్రం... పాట చూపించాడు. వైష్ణవ్‌ కళ్లు గురించి నేను, పవన్‌కల్యాణ్‌ కూడా మాట్లాడుకున్నాం. ఈ కథకి హీరో ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు తట్టింది వైష్ణవ్‌. తనకి నేర్చుకోవాలనే తపన చాలా ఉంటుంది. ఓబులమ్మ పాత్ర కోసం మరింత నాజూగ్గా మారింది రకుల్‌. సంగీత దర్శకుడిగా మొదట కాలభైరవని ఎంచుకోవాలనుకున్నా. కీరవాణితో ఈ కథ చదివించి మీరే చేయాలని చెప్పా. ఈ సినిమాలో మేమంతా ఒకొక్కరు ఒక్కో ‘కొండపొలం’ చేశాం’’.


 ‘‘మొదట ఈ చిత్రాన్ని గోవాలో తెరకెక్కించాలనుకున్నాం. అనుమతులు కూడా వచ్చాయి. కానీ కథ, పాత్రల గురించి చెప్పి ఇలా గొర్రెలు, గొర్రెలకాపరులతో చిత్రీకరణ చేస్తాం అన్నాక..గొర్రెల్ని చూసి పులులు వచ్చేస్తాయని అనుమతులు ఇవ్వలేదు. నల్లమలలో చిత్రీకరణ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో వికారాబాద్‌ అడవుల్లో చిత్రీకరణ చేశాం. పుస్తకం రాసిన సన్నపురెడ్డి సినిమాకి కూడా కథనం రాయడంతో నా పని మరింత సులభమైంది. అడవుల్లో ఏకధాటిగా 40 రోజులు చిత్రీకరణ చేయడం ఓ మంచి అనుభవం. మొదట ఒకట్రెండు రోజులు వింతగా అనిపించింది. వెయ్యి గొర్రెలతో కలిసి వెళ్లడం... అందరం కూడా సెట్‌ బాయ్స్‌ తరహాలో వస్తువుల్ని మోసుకుంటూ వెళ్లి చిత్రీకరణ చేశాం. ఈ సినిమా పూర్తయ్యేలోపు గొర్రెల్ని ఎలా కంట్రోల్‌ చేయొచ్చో మా సెట్లో అందరికీ తెలిసొచ్చింది’’.


‘‘సినిమా ప్రయాణంలో నాకు అత్యంత ఇష్టమైనది రచనే. సాహిత్యం నుంచి సినిమాకి చేసే ప్రయాణం ఎంతో ఆత్రుతగా ఉంటుంది. మా సంస్థ చాలా నవలలు కొన్నది. పెద్దింటి అశోక్‌కుమార్‌, వాసిరెడ్డి నవీన్‌, బుర్రా సాయిమాధవ్‌.... ఇలా ఎవరేం చేసినా, ఎవరేం చదివినా వాటిని నాకు పరిచయం చేస్తుంటారు. ప్రస్తుతం హాట్‌స్టార్‌ కోసం మల్లాది వెంకటకృష్ణ మూర్తి రాసిన ‘తొమ్మిది గంటలు’ నవల ఆధారంగా వెబ్‌సిరీస్‌ చేస్తున్నాం. ఇటు తెలంగాణ నుంచి అటు శ్రీకాకుళం వరకు విస్తృతస్థాయిలో రచయితలు ఉన్నారు. మన కథలు చాలానే తెరకెక్కుతున్నాయి.


‘‘హరి హర వీరమల్లు’ ఒక సన్నివేశం చేస్తే విరామం వరకు పూర్తవుతుంది. నవంబర్‌ రెండో వారం నుంచి తదుపరి చిత్రీకరణని ఆరంభిస్తాం’’.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని