Kriti Shetty:అప్పుడు చేతులు వణికిపోయాయి

‘‘పాత్ర నిడివి దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకోవడం నచ్చదు. కథ బాగుందా.. నా పాత్రకు ప్రాధాన్యముందా అనే చూసుకుంటా’’ అంది నటి కృతి శెట్టి. ‘ఉప్పెన’తో వెండితెరపై కాలుమోపిన ఈ ముద్దుగుమ్మ.. తొలి అడుగులోనే  తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నానికి జోడీగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించింది. రాహల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రమిది. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు.  ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం విలేకర్లతో ముచ్చటించింది కృతి.

Updated : 26 Dec 2021 04:47 IST

‘‘పాత్ర నిడివి దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకోవడం నచ్చదు. కథ బాగుందా.. నా పాత్రకు ప్రాధాన్యముందా అనే చూసుకుంటా’’ అంది నటి కృతి శెట్టి. ‘ఉప్పెన’తో వెండితెరపై కాలుమోపిన ఈ ముద్దుగుమ్మ.. తొలి అడుగులోనే  తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నానికి జోడీగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించింది. రాహల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రమిది. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం విలేకర్లతో ముచ్చటించింది కృతి.

‘ఉప్పెన’లో బేబమ్మ. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో కీర్తి.. రెండింటిలో మీకు ప్రత్యేకమైన పాత్రేది?

‘‘వేటికవే ప్రత్యేకం. రెండు సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలు చూశాను. పల్లెటూరి అమ్మాయిలు ఎలా ఉంటారు? అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉంటాయి? అన్నీ తెలుసుకుని ఆ పాత్ర చేశా. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం ఇంగ్లీష్‌ చిత్రాలు బాగా చూశా. మోడ్రన్‌ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని.. కీర్తి పాత్ర చేశా’’.

ప్రతి సినిమాకీ మీ పాత్ర కోసం ఇలాగే సిద్ధమవుతారా?

‘‘నేను ఓ పాత్ర చేస్తున్నానంటే.. ముందుగానే దానిపై రీసెర్చ్‌ చేస్తా. ఆ పాత్ర ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఏం తింటుంది? ఎలాంటి పాటలు వింటుంది? అన్నవి ఊహించుకుని ప్రత్యేకంగా నోట్స్‌ తయారు చేసుకుంటా. ఈ చిత్రంలో కీర్తి పాత్ర కోసం ఇంతే వర్క్‌ చేశా’’.

ఈ చిత్రంలో మీ పాత్రకు అంత స్కోప్‌ లేదనిపించిందా?

‘‘ఉప్పెన’లో నటనకు ఎక్కువ ఆస్కారమున్న మాట వాస్తవమే. ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే ఛాన్స్‌ దొరికింది. నిజానికి నాకు ‘ఉప్పెన’ తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. కానీ, కొత్తగా ఉంటుందనే ఈ పాత్ర ఎంచుకున్నా’’.

నాని చేసిన రెండు పాత్రల్లో ఏది మీకు బాగా నచ్చింది? 

‘‘నానిని అందరూ నేచురల్‌ స్టార్‌ అంటారు. ఆయన ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఎంతో సహజంగా ఒదిగిపోతారు. ఇందులో రెండు పాత్రల్నీ మరింత నేచురల్‌గా చేసి చూపించారు. నాకు వాసు పాత్రంటేనే చాలా ఇష్టం. అలాగే ‘ఎంసీఏ’, ‘నిన్నుకోరి’ సినిమాల్లోని నాని లుక్‌ చాలా ఇష్టం’’.

ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని లక్ష్యాలేమన్నా ఉన్నాయా?

‘‘నటిగా భిన్న పాత్రలు చేయాలనుంది. ఎందుకంటే రకరకాల పాత్రలు చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలు చేస్తే.. కామెడీ టైమింగ్‌ తెలుస్తుంది. ఇదంతా ప్రేక్షకుల కోసమే. వాళ్లు నాకు చాలా ప్రేమనిచ్చారు. అందుకే ఏం చేసినా వాళ్లకు నచ్చుతుందా? లేదా? అని ఆలోచించుకునే చేస్తా’’.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల విశేషాలేంటి?

‘‘బంగార్రాజు’ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఫిబ్రవరిలో వస్తుందనుకుంటా. నితిన్‌తో కలిసి నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ ఏప్రిల్‌లో వస్తుంది. రామ్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. ఓటీటీ ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తాను. బాలీవుడ్‌ నుంచి ఇప్పటి వరకు ఏ ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతుంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది’’.

ఈ చిత్ర విషయంలో మీకు బాగా సవాల్‌గా అనిపించిందేంటి?

‘‘నాకు స్మోకింగ్‌ అంటే నచ్చదు. కీర్తి పాత్ర కోసం సిగరెట్‌ తాగాల్సి వచ్చింది. అదే నాకు చాలా సవాల్‌గా అనిపించింది. రాహుల్‌ ఈ సీన్‌ గురించి చెప్పినప్పుడు దాన్ని తీసేయొచ్చు కదా అని అడిగా. ‘అది కీర్తి.. నువ్వు కృతి.. తేడా ఉండాలి కదా’ అన్నారు. అందుకే ఆ సీన్‌ చేయక తప్పలేదు. ఈ సీన్‌ కోసం ప్రత్యేకంగా నికోటిన్‌ లేని సిగరెట్లు తెప్పించారు. మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసి.. ఆ స్మోక్‌ సీన్స్‌ చేశాను. తొలిరోజు ఫొటో షూట్‌ చేసేటప్పుడు సిగరెట్‌ పట్టుకోగానే చేతులు వణికిపోయాయి (నవ్వుతూ)’’.

బోల్డ్‌ సీన్స్‌ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుందా?

‘‘బోల్డ్‌ సీన్స్‌ అనగానే అందరూ బ్యాడ్‌ అని అనుకుంటారు. మేము ఏం చేసినా వృత్తి పరంగానే చేస్తాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఎలా కష్టపడతామో.. అన్ని సీన్లకు అలానే కష్టపడతాం. రొమాంటిక్‌ సన్నివేశాలు కథకు అవసరం ఉందనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో వాటితో కథ ముడిపడి ఉంది. అందుకే చేశాను’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని