10thClass Diaries Teaser: ఆ రోజులు గుర్తుంటాయి

నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌... కొత్త బంగారులోకం, 96... సినిమాల తరహాలో మా ‘టెన్త్‌క్లాస్‌ డైరీస్‌’ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో గుర్తుంటుందన్నారు ‘గరుడవేగ’ అంజి. ఛాయాగ్రాహకుడైన ఆయన దర్శకత్వంలో అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో

Updated : 07 Dec 2022 15:30 IST

నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌... కొత్త బంగారులోకం, 96... సినిమాల తరహాలో మా ‘టెన్త్‌క్లాస్‌ డైరీస్‌’ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో గుర్తుంటుందన్నారు ‘గరుడవేగ’ అంజి. ఛాయాగ్రాహకుడైన ఆయన దర్శకత్వంలో అవికాగోర్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘టెన్త్‌క్లాస్‌ డైరీస్‌’. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్‌ మైసూర్‌ సమర్పకులు. మార్చి 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం  జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌, ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. విడుదల తేదీ పోస్టర్‌ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బి.వి.ఎస్‌.రవి ఆవిష్కరించారు. అనంతరం సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘అభినయంలో సౌందర్య తర్వాత నాకు అవికాగోర్‌ అంటే ఇష్టం. ఈ చిత్రంతో తనకి తప్పకుండా మంచి విజయం  దక్కుతుంది. అంజి పెద్ద మాస్‌ దర్శకుడు అవుతాడ’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడిగా ఇది నాకు 50వ సినిమా. దర్శకత్వం నేనే చేస్తానని అనుకోలేదు. మా నిర్మాతలు మంచి కథతో నా దగ్గరికి వచ్చారు. సుజీత్‌ చక్కటి స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. సురేష్‌ బొబ్బిలి, చిన్నా, ప్రవీణ్‌ పూడి సహకారంతో విజయవంతంగా పూర్తి చేశాన’’న్నారు. అవికాగోర్‌ మాట్లాడుతూ  ‘‘నా టెన్త్‌ క్లాస్‌ రోజులు నాకెప్పుడూ గుర్తుంటాయి. అవి చాలా  ప్రత్యేకం. నేను ‘ఉయ్యాలా జంపాలా’ సినిమా చేసింది అప్పుడే. టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’లో ఇదివరకు చేసిన పాత్రలకి భిన్నంగా,  చాలా ఆసక్తికరమైన పాత్రని చేశా’’ అన్నారు. నిర్మాత అచ్యుత రామారావు మాట్లాడుతూ ‘‘మేం పూర్వ విద్యార్థులంతా సమావేశమయ్యాక, ఆ కలయిక స్ఫూర్తితో రాసుకున్న కథ ఇద’’న్నారు. నటుడు  శ్రీనివాసరెడ్డి, నేపథ్య సంగీత దర్శకుడు చిన్నా, రచయిత సుజీత్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని