Maruthi: ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టే శక్తి ఉండాలి

‘‘ప్రేక్షకులకు సినిమాలు చూడటం రావడం లేదని.. దర్శకులు తమ    వైఫల్యాలను ఇతరులపైకి నెట్టేయడం సమంజసం కాదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా కథలు అందించే ప్రయత్నం చేయాలి. మనం ఒక సినిమా తీస్తే.. వాళ్లు వంద సినిమాలు చూస్తారు. వాళ్ల తీర్పు ఎప్పుడూ పక్కాగానే ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మారుతి.

Updated : 28 Jun 2022 07:14 IST

మారుతి

‘‘ప్రేక్షకులకు సినిమాలు చూడటం రావడం లేదని.. దర్శకులు తమ వైఫల్యాలను ఇతరులపైకి నెట్టేయడం సమంజసం కాదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా కథలు అందించే ప్రయత్నం చేయాలి. మనం ఒక సినిమా తీస్తే.. వాళ్లు వంద సినిమాలు చూస్తారు. వాళ్ల తీర్పు ఎప్పుడూ పక్కాగానే ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.   

మీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ‘పక్కా కమర్షియల్‌’ ప్రి రిలీజ్‌  వేడుకలో చిరంజీవి ప్రకటించారు. ఎలా అనిపించింది?
యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కించాలని గతంలోనే అనుకున్నాం. కథా చర్చలు జరిగాయి. ఇది ఎప్పుడు ప్రారంభించాలన్నది ఆయన డేట్స్‌కి అనుగుణంగా ప్లాన్‌ చేద్దామనుకున్నాం. దీన్ని ఆయన అలా వేదికపై స్వయంగా ప్రకటించడం.. నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. నాకే కాదు.. నాలాంటి కొత్త దర్శకులందరికీ స్ఫూర్తినిచ్చే విషయం. ‘మంచి సినిమా తీస్తే.. కచ్చితంగా చిరంజీవి లాంటి అగ్ర హీరోలు మనతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉంటారని ఆయన మాట ఓ నమ్మకాన్ని అందించింది.

ఓ దర్శకుడిగా మీరు బాగా నమ్మే సూత్రమేంటి?   

నన్ను నేను దర్శకుడిగా ఎప్పుడూ భావించుకోను. ప్రేక్షకుడిననే ఫీలవుతా. ఓ కథని ప్రేక్షకుడిగా చూడగలిగినప్పుడే మంచి సినిమా తీయగలుగుతాం. గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకోగలుగుతాం. నాలో ఉన్న ఈ కమర్షియల్‌ కోణం, పరిమిత బడ్జెట్‌లో సినిమా చేయడం.. డిస్ట్రిబ్యూషన్‌ చేయడం వల్లే వచ్చాయి. గొప్ప సినిమా తీశామని కొన్నిసార్లు మనమే అనుకుంటాం. కానీ, ప్రేక్షకులు ఇచ్చిన ఫలితం చూశాక.. వాళ్లెందుకు తిరస్కరించారో అర్థం కాదు. అందుకే ముందు వాళ్ల నాడి పట్టుకునే ప్రయత్నం చేయాలి. సినిమా అన్నది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. అలాంటప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి కథలు కావాలో వాళ్లకి ఇచ్చి.. వాళ్ల నుంచి డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడిపైనే ఉంటుంది. ఈ మధ్యవర్తిత్వం అన్నది సరిగ్గా చేయకపోతే ఇటు నిర్మాత నష్టపోతాడు. అటు ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ప్రస్తుతం పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దర్శకుడిపై చాలా బాధ్యతలు ఉన్నాయి. ఓవైపు నిర్మాతను కాపాడుకోవాలి.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలి.. సినిమా ఓటీటీకి వెళ్తే చూసే వాళ్లని చూపు తిప్పుకోనివ్వకుండా చేయాలి.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆలోచించి కథలు సిద్ధం చేసుకోవాలి. ఓ ప్రేక్షకుడ్ని రెండున్నర గంటలు థియేటర్లో లాక్‌ చేయడానికి దర్శకుడికి చాలా శక్తి ఉండాలి. 

తక్కువ రోజుల్లో మంచి నాణ్యతతో సినిమా తీస్తారని మీకు పేరుంది. అదెలా పట్టారు? 

పట్టడమంటూ ఏమీ లేదండి. స్క్రిప్ట్‌ను పకడ్బందీగా సిద్ధం చేసుకొని, దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే ఎడిట్‌ చేసుకోగలిగితే ఖర్చు చాలా తగ్గిపోతుంది. సమయం వృథా కాదు. దీనికోసం స్క్రిప్ట్‌ దశలోనే రెండు నెలలు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. కాకపోతే మనకున్న బద్ధకం వల్ల కథ సిద్ధం చేసుకొని.. మిగతాది ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర చూసుకుందాంలే అనుకుంటాం. ఇది చాలా తప్పు. అప్పుడు మన కథలో చెత్త ఉందని మనమే ఒప్పుకున్నట్లు. తమిళ దర్శకుల్లో ఒక్కో సినిమా కోసం నాలుగైదేళ్లు స్క్రిప్ట్‌లపై పని చేసిన వాళ్లు ఉన్నారు. ‘రాక్షసన్‌’ సినిమా స్క్రిప్ట్‌ని నాలుగేళ్ల పాటు రాశారు. ఆ కష్టం తెరపై బలంగా కనిపిస్తుంది. అందుకే అదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. 

ఇంతకీ ‘పక్కా కమర్షియల్‌’ ఎలా ఉంటుంది? 

మంచి కమర్షియల్‌ సినిమా తీయాలని తీసిన చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే పక్కా కమర్షియల్‌ సినిమాలా ఉంటుంది. ఓ వెరైటీ లీగల్‌ పాయింట్‌తో ముడిపడిన ప్రతీకార కథతో రూపొందింది. గోపీచంద్‌ పాత్రలో కాస్త ప్రతినాయక ఛాయలు కనిపించొచ్చు కానీ, అవి కేవలం ప్రేక్షకుల్ని అలరించడం కోసం పెట్టినవే. ఎక్కడా ఎవరినీ బాధ పెట్టేలా ఉండవు. ఆయన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రావు రమేష్‌ని ఓ రొమాంటిక్‌ విలన్‌గా చూపించాం. సినిమాపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఇక ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది. 

‘ప్రతిరోజూ పండగే’ చిత్ర బృందాన్నే ఇందులో కొనసాగించారు. ఎందుకలా? 

ప్రతి పాత్రనీ కథకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకున్నాం. ఈ సినిమాకి అలా కుదిరిపోయింది. తెలుగులో గొప్ప నటులున్నారు. వారి ప్రతిభను మనం సరైన రీతిలో ఉపయోగించుకోవడం లేదు. గత కొన్నేళ్లలో దురదృష్టవశాత్తూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్‌. నారాయణ, ఏవీఎస్‌, వేణుమాధవ్‌ వంటి ప్రతిభావంతులైన హాస్యనటుల్ని కోల్పోయాం. తెలుగు సినిమా అభివృద్ధి చెందాలంటే.. మన ఆర్టిస్ట్‌లను మనమే తయారు చేసుకోవాలి. వాళ్ల కోసం గొప్ప పాత్రలు రాయాలి. ఇది ప్రతి దర్శకుడిపై ఉన్న బాధ్యత. ‘మన భాష, యాస, సంస్కృతులు అభివృద్ధి చెందాలంటే.. తెలుగు ఆర్టిస్ట్‌ల వల్లే సాధ్యమవుతుంద’ని అల్లు అర్జున్‌ నాతో ఎప్పుడూ చెబుతుంటారు. నా సినిమాల విషయంలో నేనది పాటించే ప్రయత్నం చేస్తున్నా. 

ప్రస్తుతం సినిమా టికెట్‌ ధరలు ఎలా ఉంటే మంచిదని మీరనుకుంటున్నారు? 

ఒక సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎంత తీసుకోవచ్చన్నది అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ లాంటి నిర్మాతలకు తెలుసు. మేము అందుకు తగ్గట్లుగానే టికెట్‌ ధరలు తక్కువగానే ఉంచాం. ధరలు ఎక్కువగా ఉంటే ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి కుటుంబంతో కలిసి థియేటర్‌కు ఎందుకు వస్తాడు? అందులోనూ ఓటీటీ లాంటి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు టికెట్‌ ధరని ఇంకా తక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిపై పరిశ్రమ పెద్దలు చర్చించి.. ఓ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే సినీ పరిశ్రమ భవిష్యత్తులో కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. 

చిరంజీవి, ప్రభాస్‌ చిత్రాల్లో ముందు పట్టాలెక్కేది ఏది? ఎలాంటి కథలతో రానున్నారు? 

ప్రస్తుతం నా దృష్టంతా ‘పక్కా కమర్షియల్‌’పైనే ఉంది. ఇది విడుదలైన 20రోజుల తర్వాత నా కొత్త సినిమాపై స్పష్టత వస్తుంది. చిరంజీవిని ఎలా చూపించాలి? ప్రభాస్‌కు ఎలాంటి కథైతే బాగుంటుంది? అన్న విషయాల్లో నాకు పూర్తి స్పష్టత ఉంది. నేను చిరుతో చేసినా.. ప్రభాస్‌తో చేసినా ప్రేక్షకులు ఎలా ఉంటే ఎంజాయ్‌ చేస్తారో.. అదే లైన్‌లో కథలుంటాయి. ఈ రెండు సినిమాల జానర్లు, టైటిళ్ల గురించి ఇప్పుడే మాట్లాడదలచుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని