Sai kumar: చనిపోయాడనుకున్న నాన్న తిరిగొస్తే

‘‘కొత్తదనం నిండిన కథతో రూపొందిన చిత్రం ‘గంధర్వ’. లాజిక్‌తో పాటు సైంటిఫిక్‌గా అద్భుతంగా ఉంటుంద’’న్నారు నటుడు సాయికుమార్‌. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అప్సర్‌ తెరకెక్కించారు. సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించారు.

Updated : 06 Jul 2022 12:02 IST

‘‘కొత్తదనం నిండిన కథతో రూపొందిన చిత్రం ‘గంధర్వ’ (Gandharva). లాజిక్‌తో పాటు సైంటిఫిక్‌గా అద్భుతంగా ఉంటుంద’’న్నారు నటుడు సాయికుమార్‌ (Sai Kumar). ఆయన కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అప్సర్‌ తెరకెక్కించారు. సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించారు. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు సాయికుమార్‌.

‘‘నేను ఈ మధ్య కన్నడలో ‘రంగీ తరంగా’ చేశాను. ఆస్కార్‌ దాకా వెళ్లింది. నేను ఆ సినిమా చేశాక ‘కొత్త వాడితో ఎలా చేశావ్‌’ అని చాలా మంది అడిగారు. కథని నమ్మానని చెప్పా. ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ అలాగే జరిగింది. ఇప్పుడీ ‘గంధర్వ’ విషయంలోనూ అంతే. కథ చాలా కొత్తగా ఉంది. మనసావాచా కర్మనా మన పని మనం చేసుకుంటూ పోతే తప్పకుండా హిట్‌ వస్తుందని నమ్మా. చేశా. ఈ చిత్రంలో ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ‘కలికాలం’లో ఒక సీన్‌ ఉంటుంది. నాన్న చనిపోయాడు అనుకున్నాక.. ఆయన తిరిగి వస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాలోనూ అలాంటి పాయింటే ఉంది. దాన్ని  దర్శకుడు అప్సర్‌ అద్భుతంగా తెరకెక్కించారు’’.

* ‘‘ఈ సినిమాలో సందీప్‌ మాధవ్‌ నాకు తండ్రిగా కనిపిస్తాడు. నేను ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిగా కనిపిస్తా. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా. సరిగ్గా అదే సమయంలో చనిపోయాడనుకున్న నా తండ్రి తిరిగొస్తాడు. తను చాలా యంగ్‌గా.. 30ఏళ్ల కుర్రాడి లాగే ఉంటాడు. మా అమ్మకు, ఆయనకు ఉన్న బంధం ఏమిటని మీడియా రకరకాలుగా హైలైట్‌ చేస్తుంది. రాజకీయంగా నన్ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు నా తండ్రి ఎందుకలా కుర్రాడిలా ఉన్నాడు? అన్నది మిగతా కథ. విరామానికి ముందు మంచి ట్విస్ట్‌ ఉంది. అందులో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. ఓ ఫజిల్‌ ఉంటుంది. కథలోని చిక్కుముడుల్ని దర్శకుడు లాజిక్‌గా విప్పిన విధానం చాలా బాగుంటుంది’’.

* ‘‘నటుడిగా.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా 50ఏళ్ల ప్రస్థానం నాది. తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించా. అయినా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. నటుడికి సంతృప్తి ఉండదు. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలనుంది. ప్రస్తుతం ధనుష్‌ ‘సార్‌’ చిత్రంలో ప్రతినాయక పాత్ర చేస్తున్నా. నానితో ‘దసరా’లో నటిస్తున్నా. తమిళంలో ‘డీజిల్‌’ సినిమా చేస్తున్నా. ఒక వెబ్‌సిరీస్‌ చేయనున్నా. ‘విక్రమ్‌’ స్ఫూర్తితో ‘పోలీస్‌ స్టోరీ’కి సీక్వెల్‌ చేయాలన్న ఆలోచన వచ్చింది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని