Karthikeya 2: ఏ చిత్రం ఆడినా.. నిర్మాతలకు ఆనందమే

‘‘జూన్‌, జులైలో విడుదలైన చిత్రాలను చూసి టాలీవుడ్‌ పరిస్థితిపై భయమేసింది. ఆగస్టులో ‘బింబిసార’, ‘సీతారామం’.. ఇప్పుడు ‘కార్తికేయ 2’ ధైర్యాన్నిచ్చాయి.

Updated : 17 Aug 2022 10:27 IST

- దిల్‌రాజు

‘‘జూన్‌, జులైలో విడుదలైన చిత్రాలను చూసి టాలీవుడ్‌ పరిస్థితిపై భయమేసింది. ఆగస్టులో ‘బింబిసార’, ‘సీతారామం’.. ఇప్పుడు ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ధైర్యాన్నిచ్చాయి. ఎలాంటి కథల్ని ఎంపిక చేసుకోవాలి? అనే విషయంలో ఈ చిత్రాలు మాకు స్ఫూర్తిగా నిలిచాయి’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు (Dilraju). ఆయన మంగళవారం హైదరా  బాద్‌లో జరిగిన ‘కార్తికేయ 2’ సక్సెస్‌ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిఖిల్‌ (Nikhil), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రమిది. ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా చందు మొండేటి తెరకెక్కించారు. అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో మంగళవారం సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘పరిశ్రమకి కొత్త ఊపిరిలూదిన ‘కార్తికేయ 2’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా.. ఈ చిత్రం నైజాంలో మంచి వసూళ్లు రాబట్టినందుకు సంతోషంగా ఉంది. దీని విడుదల విషయమై నేను, నిఖిల్‌ చాలారోజులు చర్చించాం. సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా ఉండేందుకు మేం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మాట్లాడుతుంటాం. మా ‘థ్యాంక్‌ యూ’తో క్లాష్‌ రాకుండా కొన్నాళ్లు వాయిదా వేసుకున్నారు. అక్కడితో సమస్య తీరింది. వారికి నా సపోర్ట్‌ ఇస్తానని చెప్పా. కానీ, ఈలోపే కొందరు ‘సినిమాను తొక్కేస్తున్నారు’ అంటూ తమకు తోచింది రాశారు. ఇక్కడ ఎవరూ సినిమాల్ని తొక్కేసుకోరు. ఏ చిత్రం ఆడినా మా నిర్మాతలంతా ఆనందిస్తాం. మా మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. ఇలా ఊహాగానాలు వ్యాప్తి చేసి, చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చెయ్యొద్దు. నేను సినిమా కోసం ప్రాణం ఇస్తా. దాన్ని పాడు చేయాలని ఎప్పుడూ చూడను’’ అన్నారు.

‘‘ఈ చిత్రాన్ని ఏదో సరదాగా హిందీలో ఓ యాభై థియేటర్లలో విడుదల చేస్తే.. ఈరోజున  ఆ సంఖ్య ఏడొందల థియేటర్లకు పెరిగింది. సినిమాలో సత్తా లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ‘పుష్ప’ని కూడా ఇలాగే సరదాగా ప్రయత్నించారు. అది అక్కడ ఇరగ్గొట్టేసింది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ‘‘ఈ సినిమాకి ఉత్తరాదిలోనూ మంచి ఆదరణ దక్కుతోంది. హిందీలో దేశవ్యాప్తంగా హౌస్‌ఫుల్స్‌ పడుతున్నాయి. ఇంతటి విజయాన్ని మేము ఊహించలేదు. పూర్తిగా మౌత్‌ టాక్‌తోనే సినిమా జనాల్లో ఆదరణ దక్కించుకుంటోంది’’ అన్నారు నిఖిల్‌. ‘‘రకరకాల వాతావరణాల్లో షూట్‌ చేసినా.. చిత్రబృందం ఎంతో సహకరించి, కష్టపడి చేశారు. దాని ఫలితం ఈరోజున తెరపై కనిపిస్తోంది. ఈ చిత్రానికి కాలభైరవ తన సంగీతంతో ప్రాణం పోశార’’న్నారు దర్శకుడు చందు మొండేటి. కార్యక్రమంలో అనుపమ, శ్రీనివాస్‌రెడ్డి, సునీల్‌ నారంగ్‌, శ్రీవాస్‌, బెక్కెం వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని