దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో సముద్రఖని ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు.

Updated : 27 Mar 2023 07:03 IST

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో సముద్రఖని ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ విషయాన్ని సముద్రఖని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా సెట్లో పవన్‌తో కలిసి ఉన్న ఓ వర్కింగ్‌ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘దేవునికి ధన్యవాదాలు. కల్యాణ్‌ సర్‌ టాకీ భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. జులై 28న మీ అందరినీ థియేటర్లలో కలుస్తాం’’ అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను జోడించారు సముద్రఖని. తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీథం’కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ ఫాంటసీ డ్రామాలో పవన్‌ భగవంతుడిగా కనిపించనున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


లొకేషన్ల వేటలో..

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఉన్న సినిమాల్లో ‘ఒజి’ (వర్కింగ్‌ టైటిల్‌) కూడా ఒకటి. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసమే ప్రస్తుతం లొకేషన్ల వేటలో తీరిక లేకుండా గడుపుతోంది చిత్ర బృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీంతో పాటు సుజీత్‌, ఛాయాగ్రాహకుడు రవిచంద్రన్‌ ముంబయి తీరం వెంట లొకేషన్లు పరిశీలిస్తున్న ఫొటోల్ని పంచుకున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ నుంచి షూట్‌ మొదలు కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని