పార్వతి పాత్రను కోల్పోయిన షావుకారు జానకి

చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎలా, ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్క సినిమా చాలు నటుల జీవితాలు మారిపోవడానికి. ‘షావుకారు’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించారు జానకి.

Published : 03 Feb 2024 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిత్ర పరిశ్రమలో ఎవరి అదృష్టం ఎలా, ఎప్పుడు తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్క సినిమా చాలు నటుల జీవితాలు మారిపోవడానికి. ‘షావుకారు’ చిత్రాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించారు జానకి. ఇక అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. దేవదాసుగా అక్కినేని, పార్వతిగా సావిత్రి ఆ పాత్రల్లో జీవించేశారు. అయితే, ఈ పాత్రకు తొలుత అనుకున్నది షావుకారు జానకినేనట. ఓ సందర్భంలో దీని గురించి జానకి పంచుకున్నారు.

‘‘దేవదాసు’ ప్రారంభంచనున్న కాలంలో ఒకనాడు నిర్మాత డి.ఎల్‌.నారాయణగారు, రచయిత సముద్రాల గారూ మా ఇంటికి వచ్చారు. విషయం వివరించి, నన్ను పార్వతి పాత్ర ధరించమన్నారు. నాగేశ్వరరావుగారు దేవదాసుగా నటిస్తారని, తక్కిన పాత్రలను ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. నేను చాలా సంతోషించాను. నాకు గొప్పపాత్ర లభించిందని తెగ సంబరపడిపోయాను. అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలిపాను. ‘ఓ దేవదా..’ పాట రికార్డయితే, ఆ పాటను టేప్‌ రికార్డులో పంపారు. నేను వింటూ రోజూ సాధన చేయటం మొదలు పెట్టా. షూటింగ్‌ తేదీలను కూడా ఖరారు చేశారు.’’

‘‘ఒకరోజు ఒకాయన మా ఇంటికి వచ్చి ‘ఆ సినిమాకి నేను ఫైనాన్స్‌ చేస్తున్నా. ‘దేవదాసు’లో పార్వతి మీరు కాదు. ఇంకొక నటి చేస్తున్నారు’ అని చెప్పి టేప్‌ రికార్డరు పట్టుకుపోయారు. నేను చాలా కుంగిపోయాను. ఆ తర్వాత ఆ పాత్రను సావిత్రి చేస్తున్నట్లు విన్నాను. అయితే, సినిమా చూశాక, ఒక గొప్ప నటి పార్వతి పాత్రలో అద్భుతంగా రాణించిందని సావిత్రిని మనసారా కౌగిలించుకొని, అభినందిచాను’’ అంటూ పార్వతి పాత్రను తాను చేయకపోవడం వెనుక కారణాన్ని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని