Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Bhimaa movie review: యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్‌ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా?

Updated : 08 Mar 2024 16:58 IST

Bhimaa movie review; చిత్రం: భీమా; నటీనటులు: గోపిచంద్‌, ప్రియాంక భవానీ శంకర్‌, మాళవిక శర్మ, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌, ముకేష్‌ తివారి తదితరులు; సంగీతం: రవి బస్రూర్‌; సినిమాటోగ్రఫీ: స్వామి. జె గౌడ; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: కె.కె.రాధామోహన్‌; దర్శకత్వం: ఎ.హర్ష; విడుదల: 08-03-2024

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కి కేరాఫ్ గోపిచంద్‌. మ‌రోసారి త‌న మార్క్ క‌థ‌తో చేసిన సినిమానే ‘భీమా’. ఇందులో ఆయ‌న రెండు అవ‌తారాల్లో క‌నిపించారు. స‌రైన విజ‌యం కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? (Bhimaa movie review) ‘భీమా’గా ఎలా అలరించారు?

క‌థేంటంటే: స్థ‌ల‌పురాణం ఉన్న మ‌హేంద్ర‌గిరిలో జ‌రిగే క‌థ ఇది.  ప‌ర‌శురామ క్షేత్రం కొలువైన ఆ ప్రాంతంలో భ‌వానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచ‌కాలు కొన‌సాగిస్తుంటుంది. ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కి గురిచేయ‌డంతో పాటు, అడ్డొచ్చిన పోలీసుల్ని సైతం అంతం చేస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా (గోపిచంద్‌) ఎస్సైగా వ‌స్తాడు. వ‌చ్చీ రావడంతోనే భ‌వానీ ముఠా ఆట క‌ట్టించేందుకు న‌డుం బిగిస్తాడు. అట‌వీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంక‌ర్ల‌పై నిఘా వేస్తాడు. వాటి జోలికి ఎవ‌రొచ్చినా అస్స‌లు ఊరుకోని భ‌వానీ ఏం చేశాడు? అస‌లు ఆ ట్యాంక‌ర్ల‌లో దాగిన ర‌హ‌స్య‌మేమిటి? భ‌వానీని ముందు పెట్టి వెన‌క కథ న‌డిపిస్తున్న ఓ పెద్ద మ‌నిషి క‌థేమిటి?ప‌ర‌శురామ క్షేత్రం మూత‌ప‌డ‌టానికీ, ఈ ముఠాకీ సంబంధం ఏమైనా ఉందా? ఆ క్షేత్రం త‌లుపులు మ‌ళ్లీ తెర‌చుకున్నాయా లేదా? త‌దిత‌ర విష‌యాలు (Bhimaa movie review in telugu) తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: పోలీస్ క‌థ‌లు... మాస్ పాత్ర‌లు గోపిచంద్‌కి కొత్త కాదు. పురాణనేప‌థ్యం, ఫాంట‌సీ అంశాల‌తో ముడిపెడుతూ క‌థని మ‌లిచిన విధాన‌మే ఈ సినిమాకు ప్ర‌త్యేకత. ఆ అంశాల‌తో  క‌థ‌లో కొత్తదనం వ‌చ్చినా... ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ అదే పాత ఫార్ములా స‌న్నివేశాలతో సినిమాని తీయడంతో ఆసక్తిగా అనిపించదు. ప‌ర‌శురామ క్షేత్రం స్థ‌ల‌పురాణంతో మొద‌ల‌య్యే ఆరంభ స‌న్నివేశాలు ఈ క‌థలో ఏదో ఉంద‌నే ఉత్సుక‌త‌ని రేకెత్తించినా... హీరో హీరోయిన్ల పాత్ర‌లు తెర‌పైకి రాగానే సాదాసీదాగా మారిపోతుంది. ముఖ్యంగా భీమ, విద్య (మాళ‌విక శ‌ర్మ‌) ల‌వ్ ట్రాక్ ‘అల్లిక‌’ ఏమాత్రం మెప్పించదు. కామెడీ కోసం అన్న‌ట్టుగా మ‌లిచిన ఆ స‌న్నివేశాలు అటు న‌వ్వించ‌లేక‌, ఇటు హీరో-హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ‌ని బ‌లంగా ఆవిష్క‌రించ‌లేక ప్రేక్ష‌కుడి  స‌హ‌నానికి పరీక్ష‌లా అనిపిస్తాయి. భ‌వానీ ముఠాని ఎదురించే స‌న్నివేశాలు కూడా మ‌రీ పాత సినిమాల్ని గుర్తు చేస్తాయి.

ట్యాంక‌ర్ల నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల‌తోనే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అప్ప‌టిదాకా  కాల‌క్షేపం వ్య‌వ‌హార‌మే త‌ప్ప ఎక్క‌డా సీరియ‌స్‌నెస్ క‌నిపించ‌దు. విరామానికి ముందు వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు, మ‌లుపు ద్వితీయార్ధంపై ఆస‌క్తిని పెంచుతాయి. అందుకు త‌గ్గ‌ట్టే  గోపిచంద్ కొత్త అవ‌తారంతో సినిమా మొద‌ల‌వుతుంది. మ‌ళ్లీ అక్క‌డ క‌థానాయ‌కుడికీ,  పారు (ప్రియా భ‌వానీ శంక‌ర్‌)కీ  మ‌ధ్య ఓ ల‌వ్ ట్రాక్ మొదల‌వుతుంది. ఇది మ‌రోసారి ప్ర‌థ‌మార్ధంలోని ల‌వ్‌ట్రాక్‌ని గుర్తుచేస్తుంది త‌ప్ప కొత్త‌ద‌నం లేదు. గోపిచంద్‌, వీకే న‌రేశ్, వెన్నెల కిశోర్  మ‌ధ్య స‌న్నివేశాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. హీరో చిన్న‌ప్ప‌టి ఎపిసోడ్‌, సంజీవ‌ని కోసం ర‌వీంద్ర‌వ‌ర్మ (నాజ‌ర్‌) చేసే ప్ర‌య‌త్నాలు, భ‌వానీ వెన‌కున్న పెద్ద‌మ‌నిషి వివరాలు తెలియడం, గుడి నేప‌థ్యం ఇవ‌న్నీ  ద్వితీయార్ధాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చాయి. (Gopi chand Bhimaa movie review) ప‌తాక స‌న్నివేశాలకి ముందు వ‌చ్చే అర‌గంట సినిమా ఆక‌ట్టుకుంటుంది. అక్కడ విజువ‌ల్స్ కూడా మెప్పిస్తాయి. మొదటి నుంచి ఇదే ఉత్కంఠతో సన్నివేశాలను తీర్చిదిద్ది ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

ఎవ‌రెలా చేశారంటే: రెండు కోణాల్లో క‌నిపించే పాత్ర‌ల్లో గోపిచంద్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా  ద్వితీయార్ధంలో ఆయ‌న లుక్ విభిన్నంగా ఉంది. స‌రైన సంఘ‌ర్ష‌ణ‌తో కూడిన స‌న్నివేశాల్లో ఆయన ఎంతలా ఒదిగిపోగ‌ల‌డో ద్వితీయార్ధంలో కొన్ని సీన్స్‌ వెల్లడిస్తాయి. అయితే, కామెడీ ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేదు. మాళ‌విక శ‌ర్మ పాత్ర సెకండాఫ్‌లో ఆస‌క్తిని పెంచుతుంది. పారు పాత్ర‌లో ప్రియా భ‌వానీ శంక‌ర్ జస్ట్‌ ఓకే. న‌రేశ్‌, వెన్నెల కిశోర్‌, ర‌ఘుబాబు, ర‌చ్చ రవి, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌ర కామెడీ గ్యాంగ్ ఉన్నప్ప‌టికీ న‌వ్వులు పెద్ద‌గా పండ‌లేదు.  బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం సినిమాకి పెద్ద మైన‌స్‌. కాక‌పోతే అస‌లు విల‌న్ రివీల్ అయ్యే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు హ‌ర్ష ఫ‌క్తు మాస్ క‌థ‌ని కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం బాగున్నా, దాని ప్రభావవంతగా తెరపై ఆవిష్కరించలేకపోయారు.

  • బ‌లాలు
  • + గోపిచంద్ న‌ట‌న
  • + క‌థ‌లో పురాణ నేప‌థ్యం
  • + ద్వితీయార్ధం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్ర‌థ‌మార్థం
  • చివ‌రిగా: భీమా... రెండు పాత్రల్లో గోపిచంద్ హంగామా (Bhimaa movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని