నాని రిస్క్‌కు భయపడరు

‘నాకు పెద్ద హీరోలతో చేయాలంటే భయం. ఎందుకంటే వాళ్ల సినిమాలపై భారీ అంచనాలుంటాయి. కథానాయకుల బలాన్ని బట్టి కథ రాయాలి. అది నాకు చేతకాదు. స్క్రిప్ట్‌ను బట్టి నేను నటీనటులను ఎంచుకుంటా’’ అని అంటున్నారు దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి. నాని,

Published : 01 Sep 2020 11:43 IST

హైదరాబాద్‌: ‘నాకు పెద్ద హీరోలతో చేయాలంటే భయం. ఎందుకంటే వాళ్ల సినిమాలపై భారీ అంచనాలుంటాయి. కథానాయకుల బలాన్ని బట్టి కథ రాయాలి. అది నాకు చేతకాదు. స్క్రిప్ట్‌ను బట్టి నేను నటీనటులను ఎంచుకుంటా’’ అని అంటున్నారు దర్శకుడు మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి. నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘వి’.  ఈ నెల 5న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

నాని రిస్క్‌ చేయడానికి భయపడరు. ఆయనకు పాత్ర బాగుండాలి. కథ చెప్పేటప్పుడు ఉత్సాహం కలగాలి. అప్పుడే ఓకే చెబుతారు. ‘వి’ కథ విని ‘రెండు పాత్రలు ఉన్నాయి కదా. రెండింటిలో నేనేది చేయాలి’ అని అడిగారు. ప్రతికూల పాత్ర అయితే బాగుంటుందని చెప్పా. ‘సరే చేసేద్దాం. ఇది నా 25వ సినిమా అయినా ఇలాంటి పాత్ర చేయడానికి నాకేమీ సమస్య లేదు సార్‌’ అని అన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసిన తరువాత థియేటర్లలోకి కూడా తీసుకురావాలనే ఆలోచన ఉంది. థియేటర్లో చూస్తే అభిమానులకు, చిత్రబృందానికి సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలా చేయాలనుకుంటున్నాం.

నిర్మాత దిల్‌రాజ్‌ సినిమాను ఓటీటీల్లో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఉన్న ఉత్తమమైన ఎంపికల్లో ఇది ఒకటి. ‘వి’ని డిజిటల్‌ వేదికపై విడుదల చేయొద్దని దిల్‌రాజ్‌ను నేను, నాని బతిమాలుకున్నాం. థియేటర్లు తెరుచుకోవాలని అయిదు నెలల ఎదురు చూశాం. కానీ థియేటర్లు తెరుచుకునే విషయంలో స్పష్టత లేదు. మాకూ పరిస్థితి అర్థమైంది. దాంతో ఇక దిల్‌రాజు చెప్పినట్టే ఓటీటీలో విడుదల చేయడానికి అంగీకరించాం.

* సినిమా చిత్రీకరణ సమయంలో సుధీర్, నాని చాలా సన్నిహితంగా మెలిగారు. సుధీర్‌ ఇంట్రడక్షన్‌ ఫైట్‌ కోసం భారీగా ఖర్చుచేశాం. ఎందుకంటే ఆయనకు ఆ ఇమేజీ ఉంది. దాన్ని కాపాడేలా కథలో అంతర్భాగంగా ఒక సన్నివేశం రాశా. అది సినిమాకి ఒక మూలస్తంభం. ‘వి’లో సుధీర్, నాని కంటే ఒకటి, రెండు శాతం ఎక్కువగా తెరపై కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

* ప్రస్తుతానికి వెబ్‌ సిరీస్‌లు చేసే ప్రణాళికలేమీ లేవు. ఇప్పుడు నేను నాలుగు సినిమాలు ఒప్పుకున్నా. వాటిని పూర్తి చేయాలి. నేను, విజయ్‌ దేవరకొండ సినిమా చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ ఆయన పూరీ జగన్నాథ్‌తో చేసే సినిమా పూర్తి అవ్వాలి. అంతే కాదు విజయ్‌ మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లున్నారు. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయం కొలిక్కి వస్తే మిగిలిన విషయాల గురించి ఒక స్పష్టత వస్తుంది.

* శప్తభూమి నవల ఆధారంగా పెద్ద స్థాయిలో ఒక వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. దీనికోసం రచయిత బండి నారాయణ స్వామితో మాట్లాడి నవల తీసుకున్నా. ఒకవేళ దీన్ని సినిమాలాగా తీస్తే నవలకు న్యాయం జరుగుతుందా అనే విషయంలో స్పష్టత లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని