Oy: ‘ఓయ్‌’ టైటిల్‌ అర్థమిదే.. మీరు గమనించారా?

సిద్ధార్థ్‌, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్‌!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా?

Updated : 13 Feb 2024 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోవు. కానీ, టీవీలోనో, యూట్యూబ్‌లోనో, ఓటీటీలోనో విడుదలైన తర్వాత విశేష ప్రేక్షకాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ‘ఓయ్‌!’ (Oy!) ఒకటి. సిద్ధార్థ్‌ (Siddharth), షామిలీ (Shamlee) జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా చిత్రమిది. ఇందులో హీరోను హీరోయిన్‌ పేరుతోకాకుండా ‘ఓయ్‌’ అని పిలుస్తుంది. కాబట్టి దాన్నే టైటిల్‌గా పెట్టారని చాలామంది అనుకున్నారు. ఇది ఓ కారణమేగానీ దాని వెనుక ఇంకో ఆసక్తికర పాయింట్‌ ఉంది. ఈ సినిమా రీరిలీజ్‌ (ఫిబ్రవరి 14న) కానున్న సందర్భంగా దర్శకుడు ఆనంద్‌ రంగ ఆ విశేషాన్ని పంచుకున్నారు.

ఓయ్‌ అనే పిలుపు చాలా తెలుగు కుటుంబాల్లో వినిపిస్తుంటుంది. మణిరత్నం సినిమాల్లోని కథానాయికలు.. కథానాయకుడిని ఎక్కువగా ఓయ్‌ అంటూ పిలుస్తారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని ఆనంద్‌ రంగ ఓయ్‌ని హైలైట్‌ చేస్తూ కథ రాశారు. ఇందులో సంధ్య (షామిలీ).. ఉదయ్‌ (సిద్ధార్థ్‌)ని పేరుతోకాకుండా ఓయ్‌ అనే పిలుస్తుంటుంది. టైటిల్‌ పెట్టడానికి ఇదొక అంశమే అయినా కథను బేస్‌ చేసుకుని సినిమాకి పేరు పెడితే బాగుండదని డైరెక్టర్‌ భావించారు. మరి, స్టోరీ పరంగా ‘ఓయ్‌’ అని ఎలా వస్తుందనుకుంటున్నారా?

సంధ్య, ఉదయ్‌ల ప్రేమ 2007 జనవరి 1న (ఉదయ్‌ పుట్టినరోజు) మొదలవుతుంది. ఉదయ్‌ తండ్రి సంక్రాంతి సమయంలో మరణిస్తాడు. మరోవైపు, వాలంటైన్స్‌ డే, హోలీ, వినాయక చవితి, క్రిస్మస్‌.. ఇలా పండగలకు సంబంధించి సన్నివేశాలు క్రియేట్‌ చేశారు. సంధ్య క్యాన్సర్‌తో పోరాడి 2008 జనవరి 1న కన్ను మూస్తుంది. ఇలా.. 2007 జనవరి 1న మొదలైన వారి ప్రేమ 2008 జనవరి 1తో ముగుస్తుంది. ఏడాదిపాటు సాగే ప్రేమకథ కావడంతో ఆంగ్లంలో పేరు పెట్టారు. అంటే.. One Year- OY! అని అర్థం. మరి, ఈ సినిమా చూసినప్పుడు దానిని మీరు గమనించారా..? జగదేక వీరుడు అతిలోక సుందరి, కిల్లర్, నిప్పు రవ్వ తదితర చిత్రాల్లో బాల నటిగా మెప్పించిన షామిలీ.. ఓయ్ తో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రం 2009 జులై 3న విడుదలైంది. మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని