రజనీ జీవితంలో ఆసక్తికర ఘటనలు తెలుసా?

‘కబాలి’ పోస్టర్‌లో రజనీకాంత్‌ సూట్లూ, బూట్లూ, కార్లూ చూసిన వాళ్లెవరికైనా ‘సూపర్‌స్టార్‌ అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తుంది. దేశంలో అత్యధిక పారితోషికం

Updated : 12 Dec 2020 16:26 IST

‘కబాలి’ పోస్టర్‌లో రజనీకాంత్‌ సూట్లూ, బూట్లూ, కార్లూ చూసిన వాళ్లెవరికైనా ‘సూపర్‌స్టార్‌ అంటే ఇలా ఉండాలి’ అనిపిస్తుంది. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగానూ రజనీకి పేరుంది. కానీ ఆ దర్జాలూ, విలాసాలూ సినిమాలకే పరిమితం. నిజజీవితంలో ఆయన చాలా సాదాసీదాగా ఉంటాడని అభిమానులందరికీ తెలుసు. కానీ అది ఏ స్థాయి నిరాడంబరతో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే.

బిచ్చగాడు అనుకొని

ఓసారి బెంగళూరులోని ఓ గుడిలో గట్టు మీద రజనీ ఒంటరిగా కూర్చొని ఉన్నారు. ఆయన ఆహార్యాన్ని చూసి భిక్షగాడు అనుకొని ఓ మహిళ పది రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయింది. కాసేపటి తరవాత రజనీకాంత్‌ బయటికి వచ్చి కారు ఎక్కుతున్నప్పుడు ఆమె గుర్తుపట్టి దగ్గరికొచ్చి క్షమించమని అడిగిందట. ‘స్టార్‌డమ్‌, మేకప్‌ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తుచేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను’ అంటారు రజనీ.

నేలమీద పడక

‘దళపతి’ సినిమా షూటింగ్‌ సమయంలో అరవింద్‌ స్వామి తెలీక ఓ రోజు రజనీకాంత్‌ గదికి వెళ్లారు. అప్పటికే అందులో ఏసీ ఆన్‌లో ఉండీ, మంచం పూలపాన్పులా హాయిగా అనిపించడంతో తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచి చూసేసరికి రజనీ అదే గదిలో నేలమీద పడుకొని కనిపించారు. అప్పటికి అరవింద్‌స్వామి అనామకుడే. మరోపక్క రజనీ అప్పటికే సూపర్‌స్టార్‌. అందుకే అరవింద్‌ స్వామి కంగారుగా బయటికి వెళ్లి యూనిట్‌ సభ్యులను విషయం ఏంటని ఆరాతీస్తే... ముందురోజు రాత్రి షూటింగ్‌ అయ్యాక గదికి వచ్చిన రజనీ, తన మంచం మీద నిద్రపోతున్న అరవింద్‌ స్వామిని చూసి అతన్ని లేపొద్దని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి అక్కడే నేల మీద పడుకున్నారట.

రంగు వేయరు

సినిమాల్లో ఎంత స్టైల్‌గా ఉన్నా బయట మాత్రం ధోతీ, కుర్తా, ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పుల్లోనే కనిపిస్తారు రజనీ. మేకప్‌, నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి అతను ఇష్టపడరు. ‘అమ్మ పిల్లలకి మంచి బట్టలు తొడిగి, అందంగా తయారు చేసి చూసుకుని మురిసిపోతుంది. అలానే అభిమానులు కూడా నన్ను అందంగా రకరకాల గెటప్‌లలో చూడాలనుకుంటారు. వాళ్లకోసమే సినిమాల్లో అలా కనిపిస్తా. బయట నేను నాలానే ఉంటా’ అంటూ తన ఆహార్యం వెనకున్న ఆంతర్యాన్ని చెబుతారు రజనీ.

బీఎండబ్ల్యుకీ నో...

రా.వన్‌లో అతిథి పాత్రలో కనిపించినందుకు షారుక్‌ఖాన్‌, రజనీకి బీఎండబ్ల్యు 7 సిరీస్‌ కారును కానుకగా ఇద్దామనుకున్నారు. కానీ, తాను లగ్జరీ కార్లను ఉపయోగించననీ, అనవసరంగా దాన్ని షెడ్‌లో ఉంచడం ఇష్టంలేదనీ చెప్పి ఆ కానుకను రజనీ తిరస్కరించారు. ఇప్పటికీ షూటింగులకు రావడానికి మిగతా నటులకు ఏ కారు పంపిస్తారో అదే పంపించమని నిర్మాతలను అడుగుతారాయన.

వేడుకలకు దూరం

ఒకప్పుడు రజనీ చెన్నైలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఆ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు. అప్పట్నుంచీ అపరాథ భావంతో చెన్నైలో పుట్టినరోజును జరుపుకోవడం మానేశారు.

శత్రువులు ఉండరు

1996 ఎన్నికల సమయంలో రజనీ ఓ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు, మరో పార్టీ తరఫున ప్రచారం చేసిన నటి మనోరమ ఆయనని కించపరుస్తూ మాట్లాడారు. దాంతో ఎన్నికల తరవాత మనోరమకి సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రజనీ, స్వయంగా కలగజేసుకుని తన ‘అరుణాచలం’ సినిమాలో ఆమెకు అవకాశం ఇప్పించి, తనకు శత్రువులు ఎవరూ ఉండరని చెప్పారు.

ప్రచారానికి దూరం

రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య ‘త్రీ’ సినిమా తీసినప్పుడూ, చిన్నమ్మాయి సౌందర్య ‘కోచ్చడయాన్‌’ తీసినప్పుడూ రజనీ ప్రత్యేకంగా వాటికోసం ప్రచారం చేయలేదు. ‘వాళ్లకు సినిమా తీయడం తెలిసినప్పుడు దాన్ని మార్కెట్‌ చేసుకోవడం కూడా తెలిసే ఉంటుంది, మధ్యలో నా ప్రమేయం ఎందుకు’ అన్నది ఆయన మాట.

పాఠాల్లో చోటు

సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు రజనీకాంత్‌. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ఈ ఆరో తరగతి విద్యార్థులకు ఆయన జీవితమే ఓ పాఠం.

అందుకే చంద్రముఖి!

తమిళనాట ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ ఆఖరి సినిమా ‘నరసింహ’. ఆయనంటే రజనీకి చాలా గౌరవం. శివాజీ మరణం తరవాత ఆయన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు శివాజీ కొడుకు రామ్‌ కుమార్‌కి రజనీ ఫోన్‌ చేసి ‘శివాజీ ప్రొడక్షన్స్‌’ మీద మళ్లీ సినిమా తీయమనీ, తాను హీరోగా నటిస్తాననీ చెప్పారు. అలా చేసిన ‘చంద్రముఖి’ భారీ విజయాన్నే సొంతం చేసుకొని, శివాజీ ప్రొడక్షన్స్‌ని మళ్లీ గాడిలో పెట్టింది.

మూలాల్ని మరవకుండా...

తాను ఉపయోగించని వస్తువులకు ప్రచారం చేయడం ఇష్టంలేక రజనీ ఇప్పటివరకూ ఒక్క ప్రకటనలోనూ నటించలేదు. షూటింగులకు ఆలస్యంగా వెళ్లిన సందర్భాలూ, కింది వాళ్లను తక్కువగా చూసిన దాఖలాలూ లేవు. ‘అద్భుతాల్ని నేను నమ్ముతా. ఓ బస్‌ కండక్టర్‌ సూపర్‌స్టార్‌లా మారడం అద్భుతమే కదా’ అంటారు రజనీ. మూలాల్ని మరచిపోకుండా సాగిన ఆ ప్రయాణమే రజనీని అన్నివిధాలా సూపర్‌స్టార్‌ని చేసిందంటారు అభిమానులు.

హిమాలయాల్లో ధ్యానం

తన ప్రతి సినిమా విడుదలయ్యాక ఇద్దరు ముగ్గురు స్నేహితులతో కలిసి హిమాలయాలకు వెళ్లి కొన్నాళ్లు ధ్యానం చేసుకొని రావడం రజనీకి అలవాటు. ఆ సమయంలో లుంగీలూ, పంచలూ, కుర్తాలూ తప్ప మరే ఇతర సామగ్రినీ వెంట తీసుకెళ్లరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని