Jaane Jaan Review: రివ్యూ: జానే జాన్‌.. కరీనా తొలి ఓటీటీ మూవీ మెప్పించిందా?

Jaane Jaan Review: కరీనా కపూర్‌ ఖాన్‌, విజయ్‌ వర్మ, జైదీప్‌ కీలక పాత్రల్లో సుజయ్‌ ఘోష్‌ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Updated : 22 Sep 2023 15:51 IST

Jaane Jaan Review | చిత్రం: జానే జాన్‌; నటీనటులు: కరీనా కపూర్ ఖాన్‌, జైదీప్‌ అహల్వత్‌, విజయ్‌ వర్మ, సౌరభ్‌ సచ్‌దేవా తదితరులు; సంగీతం: సచిన్‌ జిగార్‌, షోర్‌ పోలీస్‌; సినిమాటోగ్రఫీ: అవిక్‌ ముఖోపాధ్యాయ; ఎడిటింగ్‌: ఊర్వశి సక్సేనా; నిర్మాత: జై శివకర్మణి, అక్షయ్‌పూరి, థామస్‌ కిమ్‌, శోభా కపూర్‌, ఏక్తా కపూర్‌; రచన, దర్శకత్వం: సుజయ్‌ ఘోష్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద వరుస సినిమాలు సందడి చేస్తున్నా, కొన్ని చిత్రాలు ప్రత్యేకంగా ఓటీటీ కోసం సిద్ధమవుతున్నాయి. వాటిలో పలు చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అగ్ర నటులు నటిస్తున్నారు. అలా కరీనా నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘జానే జాన్‌’ (Jaane Jaan Review). సుజయ్‌ ఘోష్‌ తెరకెక్కించిన ఈ మూవీ ఎలా ఉంది? కరీనా నటించిన తొలి ఓటీటీ చిత్రం మెప్పించిందా?

కథేంటంటే: మాయ డిసౌజా (కరీనా కపూర్‌ ఖాన్‌) సింగిల్‌ మదర్‌. భర్త అజిత్‌ మాత్రే (సౌరభ్‌) నుంచి విడిపోయి నేపాల్‌లో ఓ చిన్న రెస్టారంట్‌ను నడుపుతూ ఉంటుంది. మాయ నివసిస్తున్న ఫ్లాట్‌ పక్కనే ఉండే నరేన్‌ వ్యాస్‌ (జైదీప్‌ అహల్వత్‌) మ్యాథ్స్‌లో జీనియస్‌. అతడు స్థానికంగా ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మాయ భర్త, పోలీస్‌ ఆఫీసర్‌ అయిన అజిత్‌ మాత్రే.. ఆమెను కలవడానికి నేపాల్‌ వెళ్తాడు. కుమార్తె తార (నైషా ఖన్నా)ను చూసి, ఆమెను పెద్ద స్టార్‌ను చేస్తాను తనతో పంపమని అడుగుతాడు. అందుకు మాయ ఒప్పుకోదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అజిత్‌ నుంచి తన కూతురుని రక్షించే క్రమంలో హీటర్‌ వైర్‌ను అతడి మెడకు చుట్టి చంపేస్తుంది. ఈ విషయం పక్క ఇంట్లో ఉన్న టీచర్‌ నరేన్‌కు తెలుస్తుంది. మరి హత్య విషయం బయటపడకుండా ఉండేందుకు మాయ ఏం చేసింది? ఈ వ్యవహారంలో నరేన్‌ ఏవిధంగా ఆమెకు సహకరించాడు? అజిత్‌ మాత్రేను వెతుక్కుంటూ వచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌ కరణ్‌ ఆనంద్‌ (విజయ్‌వర్మ) ఈ కేసును ఎలా ఛేదించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: అనుకోని పరిస్థితుల్లో ఒక హత్య జరగడం.. దాని నుంచి తనని, తన కుటుంబాన్ని కాపాడుకోవడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎంతో చాకచక్యంగా ఎదుర్కోవడం, హత్య చేయలేదని నిరూపించే ఆధారాలను రీక్రియేట్‌ చేయటం.. ఈ విషయాలన్నీ చదువుతుంటే కచ్చితంగా మీకో సినిమా గుర్తుకు రావాలి. ఆఁ వచ్చేసింది.. అవును ‘దృశ్యం’. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ అయిన ఒక సామాన్య వ్యక్తి ఒక హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నది ఆ సినిమాలో చాలా ఉత్కంఠగా చూపించారు. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘జానే జాన్‌’. (Jaane Jaan Review) కానీ, ఈ కథను జపనీస్‌ నవల ‘ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌’ నుంచి తీసుకున్నట్లు దర్శకుడు సుజయ్‌ ఘోష్ తెలిపారు. అయితే, సినిమా ప్రారంభమయ్యే విధానం, ఆ తర్వాత జరిగే చాలా సన్నివేశాలు ‘దృశ్యం’ను గుర్తు చేస్తాయి.

సింగిల్‌ మదర్‌ అయిన మాయ డిసౌజా, ఆమె కుమార్తె ఒకవైపు.. మ్యాథ్స్‌ జీనియస్‌గా నరేన్‌ వ్యాస్‌ మరోవైపు.. ఇలా రెండు పాత్రల జీవితాలను పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఎప్పుడైతే అజిత్‌ మాత్రే పాత్ర ప్రవేశిస్తుందో అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అందకు పెద్దగా సమయం కూడా తీసుకోలేదు. 15ఏళ్ల తర్వాత వచ్చిన భర్తను చూసి, మాయ కంగారుపడటం.. ఆ తర్వాత కూతురి విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడం, మాత్రే హత్య ఇలా వరుస సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది. అజిత్‌ హత్య జరిగిన తర్వాత టీచర్‌ నరేన్‌ రంగ ప్రవేశం చేసి, తన మ్యాథ్స్‌ లాజిక్‌తో ఆ హత్యను మాయ ఎలా చేసిందో చెప్పే సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే పోలీస్‌ ఆఫీసర్‌ కరణ్‌ ఆనంద్‌ (విజయ్‌ వర్మ) రాకతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ ‘దృశ్యం’ను గుర్తు చేసేలా ఉంటాయి. కానీ, చివరి 40 నిమిషాల్లో కథను ఊహించని మలుపు తిప్పాడు దర్శకుడు. ఆ హత్య తానే చేసినట్లు నరేన్‌ అంగీకరించడంతో ఏం జరుగుతుంది? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడికి కలిగించారు. నరేన్‌ ఆ హత్యా నేరాన్ని తనపై ఎందుకు వేసుకున్నాడో తెలియాలంటే తెరపైనే చూడాలి. ఆయా సన్నివేశాలు భావోద్వేగంగా సాగుతాయి. ఒక రొటీన్‌ క్లైమాక్స్‌కు భిన్నంగా దర్శకుడు సినిమాను ముగించాడు.

ఎవరెలా చేశారంటే: చాలా తక్కువ పాత్రలతో తెరకెక్కిన చిత్రమిది. (Jaane Jaan Review) సింగిల్‌ మదర్‌ మాయ పాత్రలో కరీనా ఒదిగిపోయింది. ఆమె వయసుకు తగిన పాత్రలో చక్కగా నటించింది. మ్యాథ్స్‌ టీచర్‌ నరేన్‌ వ్యాస్‌గా జైదీప్‌ అహల్వత్‌ చాలా సెటిల్డ్‌గా నటించారు. భావోద్వేగాలను కళ్లతోనే పలికించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన హైలైట్‌. ఇక ఇన్‌స్పెక్టర్‌ కరణ్‌గా విజయ్‌ వర్మ కూడా ఓకే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, లైటింగ్‌ ఎఫెక్ట్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్‌, సంగీతం ఇతర టెక్నికల్‌ టీమ్‌ మంచి అవుట్‌ పుట్‌ను తీసుకొచ్చాయి. దర్శకుడు సుజయ్‌ ఘోష్‌ చెప్పిన కథ కొత్తదేమీ కాదు. కానీ, ఆసక్తికరంగా మూవీని మలచడంలో విజయం సాధించాడు. ఈ వీకెండ్‌లో ఒక మిస్టరీ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే, ‘జానే జాన్‌’ చూడొచ్చు. నిరాశ పరచదు.

  • బలాలు
  • + కరీనా, జైదీప్‌, విజయ్‌ వర్మ
  • + కథనం
  • + రొటీన్‌కు భిన్నంగా పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • - అక్కడక్కడా ‘దృశ్యం’ ఛాయలు
  • చివరిగా: ‘జానే జాన్‌’ ఒక డిఫరెంట్‌ మిస్టరీ థ్రిల్లర్‌
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు