JD Chakravarthy: దర్శకుడు అనుకుంటే సెన్సార్‌ అవసరమే లేదు

JD Chakravarthy: నటుడిగా... దర్శకుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశారు జేడీ చక్రవర్తి. ఆయన ఈ మధ్య వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు.

Updated : 03 Aug 2023 16:11 IST

వెబ్‌ బొమ్మ

నటుడిగా... దర్శకుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశారు జేడీ చక్రవర్తి. ఆయన ఈ మధ్య వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దయా’  నెల 4 నుంచి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘దయా’... మీకు తెలుగులో ఇది పునః ప్రవేశం అనుకోవచ్చా?

తెలుగు నా సొంత భాష. ఏదైనా మనది అనుకున్నప్పుడు ఎప్పుడైనా మనదే కదా, ఎప్పుడు అనుకుంటే అప్పుడే రావొచ్చనే ఓ నమ్మకం ఉంటుంది. అందుకే తెలుగు తప్ప హిందీ, తమిళ, మలయాళ, కన్నడ... ఇలా అన్ని భాషల్లోనూ నటిస్తున్నా. అంతా చూద్దాం అనుకుని పక్క సందులోకి వెళ్లా. అలాగని ఇక్కడ నాకు విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి కానీ నేను చేయడం లేదని చెప్పను.

‘దయా’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

చేపల్ని ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లే ఫ్రీజర్‌ వ్యాన్‌ డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తా. తను, తన పని, గర్భవతిగా ఉన్న తన భార్య... ఇలా సాధారణ జీవితం గడుపుతుంటాడు. అనుకోకుండా తన వ్యాన్‌లో ఓ రోజు ఓ అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ భయంలో ఉండగానే మరో శవం దొరుకుతుంది. చెవులు సరిగ్గా వినిపించని అతని జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు, భావోద్వేగాలు ఆసక్తికరంగా ఉంటాయి.

వెబ్‌సిరీస్‌ల్లో అసభ్యకరమైన సన్నివేశాలు, సంభాషణలపై ఓ నటుడిగా మీ అభిప్రాయమేమిటి?

కథానాయిక చిన్న చిన్న దుస్తులు వేస్తేనే సినిమాలు ఆడతాయనుకుంటే అది అబద్ధం. సినిమాని సినిమాగా చూడటానికే వస్తారు ప్రేక్షకులు. దర్శకులకి వాళ్ల కథలపై నమ్మకం లేనప్పుడే అలాంటి సన్నివేశాల్ని, మాటల్ని జోడించాలనే ఆలోచనలు వస్తాయి. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల్లో బూతులు ఉన్నాయనే చూశారా ప్రేక్షకులు? 

ఓటీటీకి సెన్సార్‌ అవసరమంటారా లేదా?

దర్శకుడి బుర్రకి సెన్సార్‌ ఉండాలి. దర్శకుడు అనుకుంటే సినిమాకి కూడా సెన్సార్‌ అవసరం లేదు. రాస్తున్నప్పుడు నాలుగ్గోడల మధ్యే తేలిపోయే వ్యవహారం అది. గొప్ప దర్శకులు, గొప్ప చిత్రాల గురించి ఓసారి ఆలోచిస్తే అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటంతోనే అవి క్లాసిక్‌ సినిమాలు అయ్యాయా? లేదు కదా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని