Krithi Shetty: సినిమా సెట్‌నే.. నా హాలీడే స్పాట్‌!

తెలుగు తెరపై ‘ఉప్పెన’లా ఎగసిపడిన అందాల కెరటం కృతి శెట్టి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు చూపిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘కస్టడీ’తో అలరించేందుకు సిద్ధమైంది.

Updated : 07 May 2023 14:09 IST

తెలుగు తెరపై ‘ఉప్పెన’లా ఎగసిపడిన అందాల కెరటం కృతి శెట్టి (Krithi Shetty). ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు చూపిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘కస్టడీ’ (Custody) తో అలరించేందుకు సిద్ధమైంది. నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వెంకట్‌ ప్రభు తెరకెక్కించారు. ఈనెల 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతి.

* ‘కస్టడీ’ సినిమాలో మీకు నచ్చిన అంశాలేంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘సాధారణంగా అన్ని సినిమాల్లో కథానాయకుడు, ప్రతినాయకుడ్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఇందులో హీరో ఆద్యంతం విలన్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. కథ సీరియస్‌ అవుతున్నప్పుడల్లా నా పాత్ర దాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంటుంది. నేనిందులో ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. మరీ ఎక్కువ గ్లామర్‌గా ఉండను. అలాగని డీగ్లామర్‌ పాత్రేమీ కాదు. నటనకు ఎంతో ఆస్కారముంది. భావోద్వేగభరితంగానూ ఉంటుంది. ఇవన్నీ చక్కగా కుదిరాయి కాబట్టే కథ విన్న వెంటనే సినిమా చేస్తానని చెప్పేశా’’.

* ట్రైలర్‌ చూస్తే.. ఇందులో మీరు ఛేజింగ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. అదేమైనా సవాల్‌గా అనిపించిందా?

‘‘నేను మామూలుగా ప్రతి సినిమాకీ డ్యాన్సులు లేదా ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని ప్రాక్టీస్‌ చేస్తుంటాను. కానీ, ఈ చిత్ర విషయానికొచ్చేసరికి ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ఎందుకంటే ఇది పూర్తిగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. నా పాత్రలో యాక్షన్‌ కోణం అంతగా కనిపించదు కానీ.. ఛేజింగ్‌ సన్నివేశాలు, అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయి. మొదట్లో భయంగా అనిపించినా వీటిని చాలా సరదాగా చేసేశాం. నీటి అడుగున చేయాల్సిన సన్నివేశాల్ని దాదాపు 15రోజుల పాటు చిత్రీకరించారు. అందులో ఐదు రోజులు పూర్తిగా నీటిలోనే చేయాల్సి వచ్చింది. ఈ సీక్వెన్స్‌ మొత్తాన్ని 20 అడుగుల లోతున్న ఓ కొలనులో షూట్‌ చేశారు. ఈ వాటర్‌ సీక్వెన్స్‌ కోసం నేను మూడు రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నా. నిమిషానికి పైగా ఊపిరి తీసుకోకుండా చేసిన సన్నివేశాలూ కొన్ని ఉన్నాయి. అవి ఎంతో సవాల్‌గా అనిపించాయి. అలాగే చాలా భయంగానూ అనిపించింది’’.

* ఇటీవల కాలంలో వరుస పరాజయాలు చవిచూశారు. పొరపాటు ఎక్కడ జరుగుతుందో గుర్తించారా?

‘‘ఇండస్ట్రీలో నాతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు. విజయానికి సరైన ఫార్ములా ఏదన్నది ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఫలితమేదైనా సరే ప్రతి సినిమా ఓ విలువైన పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. నిజానికి ‘ఉప్పెన’ లాంటి కథలు, పాత్రలు ప్రతిసారీ రావు. కానీ, ప్రతి సినిమాతో ఆ చిత్రం తాలూకూ ఇమేజ్‌ను బ్రేక్‌ చేయాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నా. ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ చిత్రాలు అందించిన అనుభవం కూడా చాలా గొప్పదే. అందుకే వాటి ఎంపికలో నేనెప్పుడూ బాధపడలేదు. జయాపజయాలు ఈ ప్రయాణంలో భాగమే. అయితే అపజయాల్ని విశ్లేషించుకొని మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా ఆచితూచి ముందుకెళ్తున్నా’’.

* భవిష్యత్తులో మిమ్మల్ని నటిగా కాకుండా ఇంకేదైనా కొత్త పాత్రలో చూసే అవకాశముందా? ఖాళీ సమయాల్లో సరదాగా గడిపేందుకు ఏం చేస్తుంటారు?

‘‘నాకు దర్శకత్వం చేయాలని ఉంది. దానికి మరో పదేళ్ల సమయమైనా పట్టొచ్చు (నవ్వుతూ). దర్శకత్వం అన్నది చాలా పెద్ద బాధ్యత. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. అందుకే నేను సెట్లో ఉంటే నటిగానే పరిమితమవకుండా చుట్టూ ఏం జరుగుతుందో.. దర్శకుడు ఏ సీన్‌ ఎలా తీస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తుంటా. నేనెప్పుడూ నా పనిని చాలా ఆస్వాదిస్తుంటా. సెట్‌లో ఉన్నప్పుడే నాకెక్కువ ఆనందంగా అనిపిస్తుంది. అందుకే సరదాగా గడిపేందుకంటూ నా దగ్గర ప్రత్యేక ప్రణాళికలేం ఉండవు. ఒకవేళ నేను హాలిడేకి వెళ్లాలన్నా సెట్‌కే వెళ్తాను (నవ్వుతూ). ఎప్పుడైనా సినిమాల నుంచి నాలుగైదు రోజులు విరామం వస్తే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. మళ్లీ సెట్‌కు ఎప్పుడెళ్తానా అని ఆలోచిస్తుంటా. ప్రస్తుతం నేను శర్వానంద్‌తో ఒక సినిమా చేస్తున్నా. మలయాళంలో ఓ చిత్రం చేస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి’’.


* ఈతరం నాయికలు నాలుగైదు చిత్రాలు చేయగానే నాయికా ప్రాధాన్య చిత్రాల వైపు దృష్టి సారిస్తున్నారు. మీరలాంటి ప్రయత్నాలు చేయట్లేదా?

‘‘అలాంటి కథలు నా వరకైతే కొన్ని వచ్చాయి. అవేమీ అంత ఆసక్తికరంగా అనిపించలేదు. నిజానికి నేను నాయికా ప్రాధాన్య చిత్రాలే చేయాలని ప్రత్యేకంగా లక్ష్యాలేమీ పెట్టుకోలేదు. మంచి స్క్రిప్ట్‌లు వస్తే తప్పకుండా చేస్తాను. దానికి మరింత సమయం ఉందనిపిస్తోంది. బాలీవుడ్‌ నుంచీ అవకాశాలు వస్తున్నాయి. మంచి కథ దొరికితే చేయాలని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఏ భాషలోకి వెళ్లినా మంచి కథతోనే తొలి అడుగు వేయాలని దృఢంగా నిశ్చయించుకున్నా. ఎందుకంటే నా కెరీర్‌ విషయంలో ఇది బాగా వర్కవుట్‌ అయ్యింది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని