Jamuna: చలాకీ చందమామ తెలుగింటి సత్యభామ
కళ్లతో కోటి భావాలు పలికించి... కనుబొమ్మలకీ ఓ భాష ఉందని చాటారు. వగరు... పొగరు తగుపాళ్లల్లో ఉంటే అవి అమ్మాయిల అందానికి ఎంత బిగువో తన అభినయంతో చాటి చెప్పారు.
కళ్లతో కోటి భావాలు పలికించి... కనుబొమ్మలకీ ఓ భాష ఉందని చాటారు. వగరు... పొగరు తగుపాళ్లల్లో ఉంటే అవి అమ్మాయిల అందానికి ఎంత బిగువో తన అభినయంతో చాటి చెప్పారు. ముక్కుమీద కోపాన్ని మూతిముడుపులతో ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో తన పాత్రల్నే ఉదాహరణగా చూపారు. తన నటనతో పగలే వెండివెన్నెలని కురిపించి ప్రేక్షక జగాన్నే ఓ ఊయలగా చేసి ఊపేసిన అభినయ ప్రజ్ఞ... జమున. గోదారి గట్టు సొగసుతోనే పోటీపడిన దిట్ట... జమున. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కనిపించిన అపర సత్యభామ... జమున.
పెళ్లి సంబంధం కోసం వచ్చిన పెద్దాయన ముందే ‘అమ్మా కాఫీ...’ అంటూ ఒళ్లు విరిచిన గారాభం... ‘గుండమ్మ...’ సరోజ. పాఠాలు నేర్చుకోమని పంపితే...
‘మాస్టారూ... ఈ హారం ఎలా ఉంది?
ఈ జుమ్కీలు ఎలా ఉన్నాయి?
ఈ ఓణీ ఎలా ఉంది?’
అంటూ గోల చేసిన... ‘మిస్సమ్మ’ సీత అల్లరి ఎవర్‌గ్రీన్!
‘మూగమనసులు’ గౌరి... ‘లేత మనసులు’ భామ పండంటి కాపురం’ రాణి మాలిని దేవి... ‘తాసీల్దారు గారి అమ్మాయి’ మధుమతి...
- ఒకటా రెండా? ఎన్నో పాత్రలకి తన విలక్షణమైన నటనతో ప్రాణ ప్రతిష్ట చేసిన నటి... జమున.
తెలుగు సినిమా స్వర్ణయుగంలో సాత్విక పాత్రలంటే సావిత్రి... పొగరైన అమ్మాయి పాత్రంటే జమునే!
మిగతా కథానాయికలకి ప్రత్యామ్నాయం కనిపించేవారేమో కానీ... కొన్ని పాత్రలకి జమున (Jamuna) తప్ప మరొకరు కనిపించేవారే కాదు. అంతగా ఆ పాత్రలపై ప్రభావం చూపించిన నటి ఆమె..
రాజసం... వీరత్వం... అమాయకత్వం కలగలసిన సత్యభామ పాత్ర పేటెంట్ హక్కులన్నీ జమునవే అన్నట్టుగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. అందుకే తెలుగింటి అపర సత్యభామ అంటే జమున పేరే చెబుతారు. తెలుగు నర్గీస్‌గా, హంపి సుందరిగా కీర్తికెక్కిన జమున... తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ 200కిపైగా సినిమాల్లో నటించి సత్తా చాటారు. మేటి నటి సావిత్రికి చెల్లెలిగా ఎన్నో సినిమాల్లో నటించి వినోదం పంచారు జమున. తెరపైనే కాకుండా, బయట కూడా సావిత్రిని అక్కా అని అప్యాయంగా పిలిచేవారు. జమునకి నటనపై మక్కువ పెరగడానికి సావిత్రే స్ఫూర్తినిచ్చారు. చిన్నప్పుడు ఓ నాటక ప్రదర్శన కోసం దుగ్గిరాలకి వచ్చిన సావిత్రి... జమున ఇంట్లోనే బస చేశారు. అక్కా అని అక్కడే తొలిసారి సావిత్రిని పిలిచారు. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాక కూడా ఆ ఇద్దరి మధ్య అక్కాచెల్లెళ్ల అనుబంధం కొనసాగింది. ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’ చిత్రాల్లో ఇద్దరూ అక్కాచెల్లెళ్లుగానే నటించారు.
అగ్ర హీరోలతో...
ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఎక్కువ సినిమాల్లో నటించారు జమున. జగ్గయ్య, హరనాథ్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, జగ్గయ్య, హరనాథ్‌ల సరసన కూడా ఆమె నటించారు. హీరోల అదృష్ట కథానాయికగా ఆమెకి పేరుంది. 1954లో ‘బంగారుపాప’, ‘వదినగారి గాజులు’ సినిమాలతో ఆమెకి వరుసగా అగ్ర నటులతో కలిసి నటించే అవకాశాలొచ్చాయి. 55లో వచ్చిన ‘మిస్సమ్మ’లో సావిత్రికి దీటుగా నటించిన జముని మంచి పేరొచ్చింది. ‘మాగోపి’, ‘తెనాలి రామకృష్ణ’, ‘భాగ్యరేఖ’, ‘చిరంజీవులు’ తదితర చిత్రాలు జమున జోరుని పెంచాయి. ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘ఈడు జోడు’, ‘రాముడుభీముడు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘లేతమనసులు’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’, ‘తాసిల్దారుగారి అమ్మాయి’, ‘మట్టిలో మాణిక్యం’, ‘ఏకవీర’, ‘పండంటి కాపురం’ తదితర సినిమాలు జమునని అగ్ర తారని చేశాయి. ఎప్పుడూ ఆమె చేతిలో ఐదారు సినిమాలు ఉండేవి. అంత బిజీగా గడుపుతున్న సమయంలోనే మరోవైపు హిందీ నుంచి అవకాశాలు అందుకున్నారు. ‘మిస్ మేరి’తో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ఎల్వీ ప్రసాద్ నిర్మించిన ‘హమ్ రాహి’, ‘బేటీ బేటే’ చిత్రాలతో అక్కడ వరుసగా అవకాశాలు అందుకున్నారు. ‘రిష్తే నాటే’, ‘మిలన్’, ‘రాము దాదా’, ‘రాజ్ తిలక్’, ‘నౌకర్ బివికా’, ‘లేడీ టార్జాన్’ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. తమిళంలో జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ సహా కమల్‌హాసన్ వరకు పలువురు కథానాయకుల సినిమాల్లో నటించారు. కన్నడలో రాజ్‌కుమార్‌తోపాటు పలువురు కథానాయకులతో కలిసి నటించారు.
మూడో హీరో
అప్పట్లో హీరోలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లే. అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేస్తేనే ఎవరైనా రాణిస్తారు. కానీ ఆ హీరోలకీ, జమునకీ మధ్య పొరపచ్ఛాలు రావడంతో మూడేళ్లపాటు వాళ్ల సినిమాలకి దూరమయ్యారు. ఇక జమున కెరీర్ ముగిసినట్టే అని మాట్లాడుకున్నారట. కానీ జమున ఆ మూడేళ్ల కాలంలోనే 18కిపైగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. జగయ్య, హరినాథ్‌లతోనూ కలిసి నటించారు. అందులో 15కిపైగా విజయాలే. జమున మూడో హీరో అని అప్పట్లో నిర్మాతలు కీర్తిస్తూ ఆమెతో సినిమాలు చేశారు. ‘గుండమ్మ కథ’ మళ్లీ ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునని ఒక్కటి చేసింది. ఈ పాత్రను జమునతో చేయించడం కోసం మూడేళ్లు ఎదురు చూశారట చక్రపాణి, నాగిరెడ్డి. నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకుని ‘మీ వల్ల అవతల నా గుండమ్మ ఏడుస్తోంది’ అంటూ ముగ్గురికీ చీవాట్లు పెట్టి రాజీ చేశారట. ఆ కలయికలో వచ్చిన ‘గుండమ్మ కథ’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరిగా ఆమె ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ సినిమాలో అతిథి పాత్రలో నటించారు.
నడకలో ప్రత్యేక వయ్యారం
తెలుగు ప్రేక్షకులకి శ్రీకృష్ణుడనగానే ఎన్టీఆర్ రూపం కళ్ల ముందు ఎలా మెదులుతుందో, సత్యభామ అంటే అలా జమున గుర్తొస్తుంది. జడ విసరడంలోనూ, నడకలో ప్రత్యేకమైన ఆ వయ్యారాన్ని ప్రదర్శించడంలోనూ తనకి తానే సాటి అనిపించుకున్నారు జమున. 1958లో వచ్చిన ‘వినాయక చవితి’లో తొలిసారి సత్యభామగా నటించారామె. 1966లో వచ్చిన ‘శ్రీకృష్ణ తులాభారం’లోనూ జమున ఆ పాత్రపై మరోసారి తనదైన ముద్ర వేశారు.
ఆ ప్రమాదంతో...
‘లేతమనసులు’ తమిళ రీమేక్‌లో నటిస్తుండగా జమున మెడకి తగిలిన దెబ్బ ఆమె కెరీర్‌ని ప్రభావితం చేసిందని చెబుతుంటారు. లేదంటే ఆమె మరిన్ని సినిమాల్లో బలమైన పాత్రల్లో కనిపించేవారే అని పరిశ్రమ వర్గాలు చెబుతుంటాయి. తమిళ ‘లేతమనసులు’ పాట చిత్రీకరణ సమయంలో గడ్డి మేట మీద నుంచి జారి హీరోయిన్ పక్కకు చేరే సన్నివేశంలో కథానాయకుడు జయశంకర్... కంగారులో ఆమె తలపై పడటంతో మెడకి దెబ్బ తగిలింది. ఆ తర్వాత వైద్యం చేయించుకున్నారు. కానీ మెడ నొప్పి సమస్య మళ్లీ కొన్నేళ్లకి తిరగబెట్టడంతో తల ఊగిపోవడం మొదలైంది. దాంతో సంభాషణలు స్పష్టంగా చెప్పలేకపోయేవారు. జమున సినిమాలకి దూరం కావడానికి ప్రధాన కారణం ఇదే అని చెబుతుంటారు.
దర్శకురాలిగా...
తన వారసుల్ని తెరపై చూసుకోవాలనే ఆశ జమునలో బలంగా ఉండేది. ముఖ్యంగా కూతురు స్రవంతిని నటనవైపు బాగా ప్రోత్సహించారు. తన కూతురికోసం స్వీయ దర్శకత్వంలో సినిమా చేయడానికీ రంగం సిద్ధం చేసుకున్నారు. ‘డాక్టర్ మమత’ నవలని స్వీయ దర్శకత్వంలో సినిమాగా తీయాలని జమున ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో చివర్లో వచ్చే హీరో పాత్రని సునీల్ దత్ చేయడానికి అంగీకరించారు. నాలుగు పాటలు రికార్డింగ్ అయ్యాక ఆ సినిమా పలు కారణాలతో సెట్స్‌పైకి వెళ్లలేదు. అయినా జమున ఆ స్క్రిప్ట్‌ని సీరియల్‌గా మలిచి, కూతురు స్రవంతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కించారు. అది దూరదర్శన్‌లో ప్రసారమైంది.
వెన్నెల్లో... బంతిపూల తోటలో నాయికలా!
జమునకు చిన్నతనంలో చిత్రసీమలోకి రావాలన్న ఆలోచన లేకపోయినా.. సినిమాలంటే చచ్చేంత పిచ్చి ఉండేదట. తన తండ్రి ఇచ్చే డబ్బులతో తోటి స్నేహితులతో కలిసి రోజూ సినిమాలకు వెళ్తుంటే.. తల్లి ఎంతో కోప్పడేదట. తనకేదైనా సినిమా బాగా నచ్చితే ఇంట్లో అమ్మానాన్నల కంటబడకుండా.. వెన్నెల్లో తమ ఇంటి పెరటిలో ఉన్న బంతిపూల మొక్కల దగ్గర నిలబడి ఆ చిత్రంలోని కథానాయికలా సంభాషణలు పలికేదాన్నని జమున ఓ సందర్భంలో పంచుకున్నారు.
మనసున్న నటి..
సాయం చేయడంలో జమున ఎప్పుడూ ముందుండేవారట. ఏపీ ప్రొఫెషనల్ థియేటర్ ఆర్టిస్ట్ ఫెడరేషన్‌కు అధ్యక్షురాలిగా పని చేసిన ఆమె.. చెన్నారెడ్డి హయాంలో రాజమండ్రిలోని 25మంది నిరుపేద కళాకారులకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇప్పించారు. అలాగే సీనియర్ సినీనటులకు పెన్షన్ ఇప్పించిన ఘనత జమునదే.
కుక్కలపై పుస్తకం రాద్దామనుకున్నా
జమునకు కుక్కలంటే ఎంతో ఇష్టం. తాను ఇప్పటివరకు దాదాపు 80కి పైగా కుక్కల్ని పెంచినట్లు ఓ సందర్భంలో పంచుకున్నారు. ఆ మూగజీవాల ప్రేమ, మనస్తత్వాల గురించి ఓ పుస్తకం కూడా రాద్దామనుకుంటున్నానని చెప్పారు. అలాగే తన రాజకీయానుభవాలతో పాటు దేశభక్తిపై తాను రాసిన కొన్ని వ్యాసాలను పుస్తకాలుగా తేవాలనుకున్నారు జమున. కానీ, ఆ కోరిక తీరలేదు.
‘నువ్వు చేయకపోతే ఉరేసుకుంటా!
జమున స్టార్ నాయికగా ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఓ నిర్మాత ఆమెతో కలిసి నటించాలని ఎంతో తాపత్రయపడ్డారట. ఆమె చేయనంటే ఉరేసుకొని చనిపోతానన్నారట. ఆయన పేరు సీతారామ్. ఈ విషయాన్ని జమున స్వయంగా పంచుకున్నారు. ‘‘సీతారామ్‌కు నాతో నటించాలని పిచ్చి. మొత్తానికి ‘బొబ్బిలి యుద్ధం’ తీశాడు. దీని గురించి తొలుత డీఎల్ నారాయణ నా వద్ద ప్రస్తావించారు. కాంబినేషన్ ఎవరని అడిగితే.. మీరు, భానుమతి, సీతారామ్ అన్నారు. నేను చేయనన్నా. ‘జమున పక్కన సీతారామ్‌ను చూస్తే సినిమా హిట్ కాకపోగా.. డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి’ అన్నా. ఆ తర్వాత డీఎల్ రోజూ వచ్చి బతిమాలేవారు. ‘అమ్మా నువ్వు చేయకపోతే ఉరేసుకొని చచ్చిపోతాడు’ అని అడిగేవారు. దీంతో చివరకు చేశా’’ అని ఆమె చెప్పారు.
సావిత్రితో ఏడాది మాట్లాడలేదు..
వెండితెరపై ఎన్నో చిత్రాల్లో అక్కాచెల్లెళ్లుగా సందడి చేసిన జమున - సావిత్రి.. నిజ జీవితంలోనూ అలాగే ఉండేవాళ్లు. సావిత్రి తనని చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేదని జమున చెప్పేవారు. వివాహ సమయంలో తనని పెళ్లి కూతురు చేసింది ఆమేనట. అయితే తమ అనుబంధం చూసి గిట్టని వారు ఇద్దరి మధ్య తగువు పెట్టారని.. దాంతో ఏడాది పాటు తామిద్దరం మాట్లాడుకోలేదని జమున ఓ సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత వివాదాలు సమసిపోయి తామిద్దరం కలిశామని.. చివరిసారి చెన్నైలో సావిత్రి పరిస్థితి చూసినప్పుడు తన మనసు చలించిపోయిందని తెలిపారు.
జయలలితతో గొడవ..
తమిళనాడును ఒక ఊపు ఊపేసిన జయలలితతో జమున ఓ సందర్భంలో గొడవ పడ్డారట. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘జయలలిత నేను ‘శ్రీకృష్ణ విజయం’లో నటిస్తున్నాం. ఆవిడ కథానాయిక. నేను సత్యభామ. కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. సెట్స్‌లో అందరం రిహార్సల్ చేస్తున్నాం. ఆమె డైలాగులు చెప్పమంటే చెప్పేవారు కాదు. ఈ విషయాన్ని దర్శకుడికి చెబితే ఏం మాట్లాడలేదు. నాకు కోపమొచ్చి అలిగా. ఆ తర్వాత దర్శక నిర్మాతలొచ్చి ఒప్పించారు. కానీ, ఆ తర్వాత సెట్లో ఆమె నటన చూసి పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆమెకు నిజంగా హ్యాట్సాఫ్’’ అంటూ ఆనాటి సంఘటనను జమున గుర్తు చేసుకున్నారు.
30 ఏళ్ల పాటు చిత్రసీమకు సేవలు చేశా. ప్రేక్షకుల మదిలో నేనొక గ్లామర్ క్వీన్. ఆత్మాభిమానం ఉన్న మనిషిని. డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేసి ఆ పేరు పాడుచేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే హీరోయిన్‌గా మానేశాక వెండితెరకు దూరంగా ఉన్నా’’
జమున
ఆ వివాదంలో నిజం లేదు..
‘శ్రీకృష్ణ తులాభారం’లో ఎన్టీఆర్ పక్కన సత్యభామగా నటించి మెప్పించారు జమున. అయితే ఆ చిత్ర విషయంలో ఆమె ఓ వివాదం ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌ను ఆమె తలపై కాలుతో తన్నారని కొందరు వివాదం సృష్టించారు. అయితే నిజానికి ఆరోజు ఏం జరిగిందన్నది జమున ఓ సందర్భంలో బయటపెట్టారు. ‘‘సినిమాలో ఓ సన్నివేశం
షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయనకు నా కాలు తగిలింది. షాట్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్‌కు ‘సారీ’ అండీ అని చెప్పా. ‘హహ్హహ్హ.. ఇట్ ఈజ్ ఆఫ్ట్రాల్ యాక్టింగ్’ అని చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు’’ అని ఆనాటి ఘటనను పంచుకున్నారామె.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
-
Sports News
MS Dhoni: ఐపీఎల్.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్ వాట్సన్
-
Politics News
Tejashwi Yadav: మాకు సీఎం..పీఎం కోరికల్లేవు: తేజస్వీ యాదవ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!