MAA Election: ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటి?: నరేశ్‌

Maa election: రాబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని, ప్రస్తుతం అధ్యక్షుడి స్థానంలో

Published : 03 Aug 2021 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని, ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉండటంతో దానిపై స్పందించటం సరికాదని సీనియర్‌ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ అన్నారు. తాజాగా ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ‘మా మసకబారింది’ అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని అన్నారు.

‘‘ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు? ఎవరికి సపోర్ట్‌ చేస్తారనేది పనితనం, పాలిటిక్స్‌, వ్యక్తిగత కారణాల బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ భావాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. ‘చెడు ఉంటే చెవిలో చెబుదాం. మంచి ఉంటే మైక్‌లో మాట్లాడదాం’ అని చిరంజీవిగారు అన్నారు. ‘మా’ గురించి చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని నియమ నిబంధనల్లో ఉంది. ‘మా’పై వ్యాఖ్యలు చేసే వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఒకప్పుడు నాగబాబుగారు రాజేంద్రప్రసాద్‌, శివాజీరాజాలకు సపోర్ట్‌ చేశారు. ఆ తర్వాత మా ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసే నడిచాం. నేను అధ్యక్షుడిని అయిన తర్వాత  ‘మా’ వెల్ఫేర్‌ కోసం కష్టపడి పనిచేశా. సభ్యుల కోసం ఆరోగ్య బీమా కల్పించాం. ‘మా’ సభ్యత్వం ఉన్న 16 మంది  చనిపోతే వారికి రావాల్సిన బీమా రూ.3లక్షలు 24 గంటల్లో అందించాం. లాక్‌డౌన్‌ సమయంలో సాయం అందించడానికి రూ.14లక్షలు ‘మా’ ఖాతాలో జమ చేశాం. చిరంజీవిగారు కూడా మెచ్చుకున్నారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయి’’ అని అన్నారు.  

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా తాను మంచి మెజార్టీతో గెలుస్తానని నరేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తాను పోటీ చేయనని, యువరక్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఏకగ్రీవం చేస్తే, గొంతు నులిమేసినట్లేనని నాగబాబు అన్న మాటలతో ఏకీభవించనని ఈ సందర్భంగా నరేశ్‌ చెప్పుకొచ్చారు. భాజపాలాంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడే ఏకగ్రీవం చేస్తారని, అలాంటప్పుడు ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటని అన్నారు. ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే, భవనం కట్టించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మంచు విష్ణు చెప్పడం అభినందనీయమన్న నరేశ్‌, అందుకు తనవంతు సాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశ్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ ఉంటుందని కేవలం నాగబాబు మాత్రమే చెప్పారని, పెద్దాయన చిరంజీవి దీనిపై ఇంకా స్పందించలేదు కదా! అన్నారు. చిత్ర పరిశ్రమలో కులాల పేరుతో రాజకీయాలు జరిగే ఆస్కారమే లేదని, అందరిదీ సినిమా కులమేనని నరేశ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని