Neru ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘నేరు’.. ఓటీటీలో వచ్చేస్తోంది!

Neru: మోహన్‌లాల్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ‘నేరు’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 19 Jan 2024 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌లాల్‌ (Mohanlal) కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నేరు’ (Neru).  డిసెంబరు 21న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, రూ.80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. మోహన్‌లాల్‌, ప్రియమణి, అనస్వర రాజన్‌ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదికగా డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) వేదికగా జనవరి 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మోహన్‌లాల్‌-జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో ఈ చిత్రంపైనా అంతే అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని నిజం చేస్తూ ‘నేరు’ మలయాళంలో హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుని, ఇతర భాషా ప్రేక్షకులు కూడా వేచి చూసేలా చేసింది.

ఇంతకీ కథేంటంటే: సారా మహ్మద్‌ (అనస్వర రాజన్‌) అనే అంధురాలు అత్యాచారానికి గురవుతుంది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది ఎవరో గుర్తించలేక పోలీసులు సైతం ఓ దశలో చేతులు ఎత్తేస్తారు. స్వతహాగా శిల్పి అయిన సారా తనపై దారుణానికి ఒడిగట్టి వ్యక్తి రూపాన్ని తయారు చేస్తుంది. ఆ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైఖేల్‌ జోసెఫ్‌ (శంకర్‌ ఇందుచూడన్‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఎంతటి క్లిష్టమైన కేసునైనా తన వాదనా పటిమతో గెలిపించగలిగే రాజశేఖర్‌ (సిద్ధిఖ్‌)ను మైఖేల్‌ తండ్రి అడ్వొకేట్‌గా నియమించుకుంటాడు. దీంతో మైఖేల్‌కు బెయిల్‌ వస్తుంది. ఈ కేసును వాపసు తీసుకోమని మైఖేల్‌ కుటుంబం నుంచి సారాకు సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ వస్తుంది. అయితే, అందుకు భిన్నంగా తాను న్యాయం కోసం పోరాటం చేస్తానని సారా చెబుతుంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ సూచన మేరకు సారా లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ను కలిసి, తన కేసు వాదించమని కోరుతుంది. ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు? విజయ్‌ మోహన్‌ కేసు టేకప్‌ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?విజయ్‌మోహన్‌, పూర్ణిమా రాజశేఖర్‌ (ప్రియమణి)ల మధ్య ఉన్న బంధం ఏంటి? చివరకు అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా పట్టుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని