Tillu square: తొలి భాగాన్ని మించేలా ‘టిల్లు స్క్వేర్‌’

‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ  సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా.. మల్లిక్‌రామ్‌ తెరకెక్కించారు.

Updated : 20 Mar 2024 10:46 IST

‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ  సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా.. మల్లిక్‌రామ్‌ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఈ చిత్ర మూడో గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఓ మై లిల్లీ.. ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసిపోకమ్మా’’ అంటూ సాగుతున్న ఈ పాటకు అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చారు. సిద్ధు, రవి ఆంథోని సంయుక్తంగా సాహిత్యమందించారు. శ్రీరామ్‌చంద్ర ఆలపించారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ.. ‘‘డీజే టిల్లు’ చేసే సమయంలో ప్రేక్షకుల్లో దానిపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాం. కానీ, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా.. తొలి భాగాన్ని మించేలా రూపొందించాం. ఇందులో టిల్లు పాత్ర అలాగే ఉంటుంది కానీ, కథ మాత్రం వేరేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘ మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు దర్శకుడు. ‘‘తొలిసారి ‘టిల్లు స్క్వేర్‌’ వేడుకలో పాల్గొన్నా. ప్రేక్షకుల స్పందన చూసి సంతోషంగా ఉంది. ఈ చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అంది అనుపమ. ‘‘యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది. వేసవి సీజన్‌లో తొలి సినిమాకి లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మార్చి 29న వస్తున్నాం’’ అన్నారు నిర్మాత నాగవంశీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని