Prasanth Varma: స్పైడర్‌మ్యాన్‌ కావాలని సాలెపురుగు పట్టుకొని తిరిగా!

‘ అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ లాంటి ప్రయోగాత్మక, వైవిద్యభరితమైన సినిమాలతో మెప్పించిన ప్రశాంత్‌వర్మ ఇప్పుడు ‘హను-మాన్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 29 May 2023 13:50 IST

‘ అ’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ లాంటి ప్రయోగాత్మక, వైవిద్యభరితమైన సినిమాలతో మెప్పించిన ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) ఇప్పుడు ‘హను-మాన్‌’ (Hanuman)తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లో ఆదివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

‘హను-మాన్‌’ ఆలస్యానికి కారణం? విడుదల ఎప్పుడు ఉండొచ్చు?

చిత్రీకరణ పూర్తైంది. గ్రాఫిక్స్‌ పనులే మిగిలాయి. ఇందులో దాదాపు 1,600 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. జూన్‌ నెలాఖరు నాటికి వాటిని పూర్తి చేస్తామని ఆయా కంపెనీలు మాటిచ్చాయి. అనుకున్న సమయానికే ఆ పని పూర్తయితే జులై తొలి వారంలో విడుదల తేదీ ప్రకటిస్తాం. టీజర్‌తో భారీ అంచనాలు ఏర్పడటంతో.. నాణ్యమైన వీఎఫ్‌ఎక్స్‌ చూపించేందుకు కష్టపడుతున్నాం. కొత్త టెక్నాలజీ కోసమే దాదాపు రూ.10కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం.

ఈ సినిమా ప్రారంభించినప్పుడే ఇంత భారీ స్థాయిలో చేయాలని అనుకున్నారా?

ఇంత భారీగా చేయాలనైతే అనుకోలేదు. వినోదం నిండిన మంచి సూపర్‌ హీరో ఫిల్మ్‌ చేయాలనుకున్నా. అయితే సినిమా మొదలయ్యాక ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి.. దీనికి ఏర్పడ్డ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని స్థాయి పెంచుకుంటూ వెళ్లాం. ఇందులోని ముఖ్య పాత్రను ఓ బాలీవుడ్‌ నటుడు పోషించారు. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తాం.

పాత్రల్ని ఈతరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా సూపర్‌ హీరోల్లా చూపించాలనుకుంటున్నారా?

ప్రతిదీ సవాల్‌తో కూడుకున్న విషయమే. దేవుడు, అమ్మ ప్రేమ అన్నవి సున్నితమైన అంశాలు. వాటిపై ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే వాటిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. మేము ఈ చిత్ర విషయంలో మరీ పెద్ద ఛాలెంజ్‌ ఏమీ తీసుకోలేదు. ఈ కథ ప్రస్తుతంలోనే జరుగుతుంటుంది. అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రాంతంలో సాగుతుంది. ఆంజనేయుడి కథలో జరిగిన ఓ కీలక ఘట్టాన్ని తీసుకొని.. దాని చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది. ఆయన్ని ఎలా చూపించాలన్న క్యారెక్టర్‌ స్కెచ్‌పైనే దాదాపు ఏడాది పాటు పని చేశాం.

ఈ సూపర్‌ హీరో కథ చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?

నా గత చిత్రాల తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు సూపర్‌ హీరో సినిమా చేయాలనిపించింది. ఎందుకంటే సూపర్‌ హీరోలంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్‌ చూసి.. నేనూ అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగు పట్టుకొని తిరిగా. అంతర్జాతీయ మార్కెట్‌లో సూపర్‌ హీరో అనేది కమర్షియల్‌ జానర్‌. తెలుగులో మనం ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదని ‘హను-మాన్‌’ చేశా.

దీన్ని ఫ్రాంచైజీగా కొనసాగించే అవకాశముందా?

ప్రతి సూపర్‌ హీరో సినిమాకి ఓ బలమైన ఆరిజన్‌ ఫిల్మ్‌ ఉంటుంది. తొలి సినిమాలో సూపర్‌ హీరోగా మారిన పాత్ర ప్రేక్షకుల్లో బలమైన ప్రభావం చూపుతుంది. చెడుని అంతం చేసిన తర్వాత ఆ పాత్ర ఏం చేయనుందనే ఆసక్తి ఉంటుంది. ఇందులో కూడా హనుమంతుగా తేజ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక తను ఏం చేస్తాడన్నది ఆసక్తిరేకెత్తిస్తుంది. దీన్ని ఓ యూనివర్స్‌లా కొనసాగించనున్నాం. నా తర్వాతి సూపర్‌ హీరో చిత్రం ‘అధీర’కు దీనికి కనెక్షన్‌ ఉంటుంది.

ఈ చిత్ర విషయంలో రాజమౌళి ఏమైనా సలహాలిచ్చారా?

టీజర్‌ విడుదలయ్యాక నేను రాజమౌళిని వెళ్లి కలిశా. ఆయన కొన్ని సూచనలిచ్చారు. దాని వల్ల మాకు చాలా సమయం కలిసొచ్చింది. ఈ చిత్రాన్ని తొలుత పాన్‌ ఇండియా స్థాయిలో ఒకేసారి విడుదల చేసి.. ఆ తర్వాత విదేశీ భాషల్లో విడుదల చేయనున్నాం. ఇది రాజమౌళి ఇచ్చిన సలహానే. దాని వల్ల ప్రమోషన్స్‌కు కావాల్సినంత సమయం దొరుకుతుంది’’. 


బాలకృష్ణతో అలాంటి సినిమా..

‘‘అన్‌స్టాపబుల్‌’ షో కోసం బాలకృష్ణతో కలిసి పని చేశా. దాని విషయంలో నా పని నచ్చి సినిమా చేసే అవకాశమిచ్చారు. ఈ చిత్రం నా స్టైల్‌లో కొంత.. బాలయ్య స్టైల్‌లో కొంత ఉంటుంది. ఆయన రాయలసీమ ఫ్యాక్షన్‌ కథలతో పాటు అన్ని రకాల కథలూ చేసేశారు. కాబట్టి ఆయన ఇప్పటి వరకు చేయనిది ఈ కథలో చూపించాలి. దీనికి తగ్గ కథ కూడా సిద్ధం చేసుకున్నా. దాన్ని ఆయనకు కూడా వినిపించా. అయితే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుంది’’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని