Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్‌ అప్‌డేట్‌పై హీరో పోస్ట్‌

షూటింగ్‌ సమయంలో అయిన గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తెలిపారు. ఈ మేరకు ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు.

Published : 29 Sep 2023 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా చిత్రీకరణలో ప్రమాదానికి గురైన దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ‘విలాయత్‌ బుద్ధ’ (Vilayath Buddha) సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ బస్సు నుంచి జారి పడడంతో పృథ్వీరాజ్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మోకాలుకు శస్త్రచికిత్స చేశారు. తాను కోలుకున్నట్లు తాజాగా తెలిపిన పృథ్వీరాజ్‌ తనకు చికిత్స చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు.

‘యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా నేను గాయపడి మూడు నెలలు అవుతోంది. మోకాలికి చాలా క్లిష్టమైన చికిత్స చేయించుకున్నాను. నాకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. రోజుకు 9 గంటల పాటు ఫిజియోథెరపీ చేయించుకున్నా. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినప్పుడల్లా ఇంకెన్ని రోజులో అనుకున్నాను. కానీ, నిపుణులైన డాక్టరలంతా కలిసి నన్ను మూడు నెలల్లో మాములు మనిషిని చేశారు. వృత్తిపై వాళ్లకు ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా నేను కోలుకోవాలని ప్రార్థించిన నా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ వందశాతం ఇవ్వడానికి కృషి చేస్తాను. రేపటి నుంచి క్రేజీ అప్‌డేట్‌లతో మీ ముందుకు వస్తాను’ అని రాశారు.

సెన్సార్‌ బోర్డుపై విశాల్‌ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘సలార్‌’లో (Salaar) పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు గాయమయ్యే సమయానికే ‘సలార్‌’లో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆయన తనదైన మార్క్‌ చూపించారు. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ ఒరిజినల్‌ వెర్షన్‌ ‘లూసిఫర్‌’కు పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహించారు. దీనికి కొనసాగింపుగా ‘లూసిఫర్‌2’ రాబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని