Vishal: సెన్సార్‌ బోర్డుపై విశాల్‌ ఆరోపణలు.. స్పందించిన కేంద్రం

తన చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు కొంతమంది తన వద్ద నుంచి లంచం తీసుకున్నారంటూ నటుడు విశాల్‌ (Vishal) గురువారం ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది.

Updated : 29 Sep 2023 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (Central Board of Film Certification) ముంబయి కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్‌ (Vishal) చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ఈ విషయంపై నేడు విచారణ జరపనున్నట్లు తెలిపింది. ‘‘సెన్సార్‌ కార్యాలయంలో అవినీతి జరిగినట్టు వార్తలు రావడం దురదృష్టకరం. అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడినట్టు తెలితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయంపై నేడు విచారణ జరపనున్నారు’’ అని తెలిపింది.

రివ్యూ: పాపం పసివాడు.. సింగర్‌ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. ‘‘అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇది జరుగుతోంది. నా ‘మార్క్‌ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ పనులు పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలిచ్చా (స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు). నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ మేరకు ఆ ఇద్దరి ‘ఎక్స్‌’ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలనూ పోస్ట్‌లో పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర సమాచార శాఖ తాజాగా స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని