Anand Deverakonda: ఆనంద్‌కు నేనే బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలనుకున్నా కానీ: కోలీవుడ్‌ నిర్మాత

ఆనంద్‌ దేవరకొండ, రితికా నాయక్‌ జంటగా ‘డ్యూయెట్‌’ సినిమా రాబోతుంది. పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. మరి, కోలీవుడ్‌ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా.. ఆనంద్‌ గురించి ఏమన్నారంటే?

Published : 02 Nov 2023 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda)కు తానే తొలి బ్లాక్‌బస్టర్‌ అందించాలనుకున్నానని, అయితే ఆ అవకాశం అతడు ఇవ్వలేదని కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా (KE Gnanavel Raja) పేర్కొన్నారు. ఇప్పటికే ఆనంద్‌ ‘బేబీ’ (Baby)తో ఘన విజయాన్ని అందుకోవడాన్ని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడారు. ఆనంద్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, ‘బేబీ’లాంటి సినిమాలో తాను నటిస్తాడని, అది పెద్ద హిట్‌ అవుతుందని అనుకోలేదన్నారు. ఆనంద్‌ హీరోగా స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌ ‘డ్యూయెట్‌’ (Duet) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. అనంతరం చిత్ర బృందం మీడియాతో పలు విశేషాలు పంచుకుంది.

ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..!

జ్ఞానవేల్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘నోటా’ చిత్రాన్ని నిర్మించా. ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్‌తో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది. ఆనంద్‌ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. స్వీట్‌ పర్సన్‌. నటుడిగా అతడి ఎదుగుదల చూసి ఓ సోదరుడిలా గర్వంగా ఫీలయ్యా. సుమారు మూడేళ్ల క్రితమే ‘డ్యూయెట్‌’ సినిమాకు కమిట్‌ అయ్యాం. సాధారణంగా నేను యాక్షన్‌ కథలకే అధిక ప్రాధాన్యమిస్తా. కానీ, దర్శకుడు మిథున్‌ చెప్పిన ఈ లవ్‌స్టోరీకి బాగా కనెక్ట్‌ అయ్యా. అందుకే ఈ స్క్రిప్టును వదులుకోకూడదని అనుకున్నా. ప్రేమకథల్లో అట్లీ తెరకెక్కించిన ‘రాజా రాణి’ సినిమా ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో మిథున్ చెప్పిన కథ కూడా అలానే కొత్తగా ఉంటుంది. దర్శకుడు, నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి ఈ చిత్రంలో భాగమవడం సంతోషం’’ అని అన్నారు.

టైటిల్‌తోనే పాజిటివ్‌ వైబ్స్‌: ఆనంద్‌ 

‘‘నా కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. డ్యూయెట్‌ టైటిల్‌ ఎలా ఉందని చిత్ర పరిశ్రమలోని కొందరికి అడగ్గా ‘బాగుంది. మేమెందుకు ఇలాంటి పేరు రిజిస్టర్‌ చేసుకోలేకపోయాం’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా పేరు నుంచే పాజిటివ్‌ వైబ్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. జ్ఞానవేల్‌ సర్‌ కోలీవుడ్‌లో సూర్య, కార్తిలతో విరివిగా సినిమాలు చేస్తున్నట్లే ఇక్కడ మాతో (తాను, విజయ్‌ దేవరకొండ) చేస్తారని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన మా సినిమాకి మ్యూజిక్‌ అందిస్తారని దర్శకుడు చెప్పగానే ఓ వైపు ఆనందించినా మరో కాస్త టెన్షన్‌ ఉంది’’ అని చెప్పారు. ఈ సినిమాలో ఆనంద్‌ సరసన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ ఫేమ్‌ రితికా నాయక్‌ నటిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ క్లాప్‌ కొట్టారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్‌ దేవరకొండ, అతడి తల్లిదండ్రులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని