పూరి మాట: వాళ్లే అసలైన మిస్‌ ఇండియాలు

సినిమాల్లో మాటల తూటాలతో అలరిస్తున్న పూరి జగన్నాథ్‌... ఇటీవల మ్యూజింగ్స్‌ పేరుతో ఓ పాడ్‌కాస్ట్‌ను లాంచ్‌ చేశారు. తన జీవితంలోని విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న, గతంలో జరిగిన అంశాల గురించి తన అభిప్రాయాలను

Updated : 13 Aug 2020 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల్లో మాటల తూటాలతో అలరిస్తున్న పూరి జగన్నాథ్‌... ఇటీవల మ్యూజింగ్స్‌ పేరుతో ఓ పాడ్‌కాస్ట్‌ను లాంచ్‌ చేశారు. తన జీవితంలోని విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న, గతంలో జరిగిన అంశాలపై తన అభిప్రాయాలను వివరిస్తున్నారు.  ఆయన సినిమాల్లో డైలాగ్‌ తలపిస్తూ పాడ్‌కాస్ట్‌లో మాటలు కాస్త గట్టిగానే తాకుతున్నాయి. అందులో తాజాగా ‘స్త్రీ’ పేరుతో ఓ మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అందులో పూరి ఏమన్నారంటే...

స్త్రీని మనం ఎప్పుడూ పుస్తకాల్లోనే గౌరవించాం. నిజ జీవితంలో కాదు. మాతృస్వామ్య వ్యవస్థ పోయి, ఎప్పుడైతే సమాజం మగాళ్ల చేతికొచ్చిందో అప్పటినుంచి ఆడాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది అనేలా తయారైంది. ఇంట్లో పనుల కోసం, వంట కోసం అన్నట్లు చూడటం మొదలైంది. కొన్నేళ్ల క్రితం పేదరికం, ఆత్మన్యూనత భావం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుంది కదా అనుకునేవారు. దీని తర్వాత వరకట్నం వచ్చింది. అది ఇప్పటికీ పోవడం లేదు. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని దారుణం సతీసహగమనం. భర్త చనిపోతే అదే చితి మీద బతికున్న భార్యను తగలబెట్టడం. ఒకరోజు కాదు, వంద రోజులు కాదు... కొన్ని వందల ఏళ్లు ఆడవాళ్లను తగలబెట్టాం. సజీవదహనం చేశాం. ఆఖరి సజీవ దహనం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిన్నగాక మొన్న 1987లో మధ్యప్రదేశ్‌లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002లో 65 ఏళ్ల మహిళను సజీవ దహనం చేశారు. ఆ తర్వాత ఆడవాళ్లను విధవను చేశాం. వితంతువును ఎన్ని కష్టాలు పెట్టామో మనందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మ, నాన్నమ్మను చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకకూడదు. శుభకార్యం అయితే ఆ చుట్టుపక్కలకు రానివ్వరు. ఆవిడ ఎదురొస్తే అశుభమట. అలా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు దాక్కోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజుల్లో ఆచారం ముసుగులో మూర్ఖుల్లా వ్యవహరించారు. అందుకే మన గురించి గొప్పలు చెప్పుకోకండి. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది. ఈ ఒక్క దేశంలో ఆడవాళ్లు ధైర్యంగా తిరుగుతున్నారు.. మాట్లాడుతున్నారు. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటున్నారు. కానీ 60 వేల సంవత్సరాలు ఆడవాళ్లకు నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకు ఒక రేప్‌ జరుగుతూనే ఉంది. ఏ దేశంలో స్త్రీకి  గౌరవం లభిస్తుందో, ఆ దేశాలే అందరినీ రూల్‌ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ ఇబ్బందులు పడ్డాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. ఇక నుంచైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడాళ్లు ఎదగాలి. అందగత్తెలకు కాదు ర్యాంప్‌ వాక్‌లు.. మగాళ్ల తోడు లేకుండా తన కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్‌ వాక్‌లు. విజయవంతమైన, దృఢమైన, స్వతంత్ర భావాలతో తనను తాను నిరూపించుకున్న మహిళలను గౌరవించాలి.. సన్మానాలు చేయాలి. వాళ్లే మన మిస్‌ ఇండియాలు

- పూరీ జగన్నాథ్‌ @ పాడ్‌కాస్ట్‌

ఈ మ్యూజింగ్‌ ఆయన మాటల్లో వినాలంటే...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని