Puri Musings: అలా అయితే నువ్వు ర‌జ‌నీ అవుతావు

 ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరిట ప‌లు అంశాల గురించి తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Updated : 16 Jun 2021 12:53 IST

ప్రాక్టీస్ గురించి పూరి ఏమ‌న్నారంటే

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పేరిట ప‌లు అంశాల గురించి తెలియ‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్రాక్టీస్ గురించి వివరించారు. ఏదైనా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిత్య సాధ‌న మ‌ర‌వ‌కూడ‌ద‌ని గుర్తుచేశారు. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఆయ‌న మాట‌ల్లోనే...

‘‘బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు 10,000 కిక్స్ తెలిసిన వాడంటే భ‌యం లేదు. కానీ ఒక కిక్‌ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటానని. ఎందుకంటే ఆ కిక్‌లో వాడు మాస్ట‌ర్ అయి ఉంటాడు. అలాంటి వాడు కొడితే మ‌న కాలు విరిగిపోద్ది. అందుకే మ‌నకు ఏ ప‌ని తెలిస్తే, అందులో మాస్ట‌ర్ అయిపోవాలి. అందుకు ప్రాక్టీస్ చేయాలి. దీన్నే సాధ‌న అంటారు. నువ్వు ఎంత పెద్ద సింగ‌ర్‌వి అయినా రోజూ ప్రాక్టీస్ చేయ్‌. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని నెమ‌రువేసుకో. కొండెక్కి అరువు.. గొంతు చించుకో. నువ్వు బాక్స‌ర్ అయితే రోజూ కిక్ బ్యాగ్‌ని కొట్టు. నీకు బోలెడు నాలెడ్జ్ ఉండొచ్చు. ప్రాక్టీస్‌లో పెట్ట‌క‌పోతే అది ఎందుకూ ప‌నికిరాదు’’

‘‘ఒక ఆర్ట్ నీకు పూర్తిగా తెలిసి ఉండొచ్చు. శాస్త్రం మొత్తం నువ్వు చ‌దివేసి ఉండొచ్చు. నాకు అన్నీ తెలుసులే అని కూర్చుంటే చెంప ప‌గులుద్ది. కుంగ్ ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేక‌పోతే కుమ్మేస్తారు. అమితాబ్ బ‌చ్చ‌న్ గారితో నేను ప‌నిచేశా. గ్రేట్ యాక్ట‌ర్‌. అయినా స‌రే రోజూ షూటింగ్ అయిపోగానే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌రికి స్వ‌యంగా త‌నే వెళ్లి మ‌రుస‌టి రోజు సీన్ పేప‌ర్ తీసుకుంటారు. ఉద‌యం లేవ‌గానే ఆయ‌న అద్దం ముందు నిలబడి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు. మ‌ళ్లీ షూటింగ్‌లో డైరెక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి అదే సీన్ పేప‌ర్‌ ఇచ్చి చ‌ద‌వ‌మంటారు. త‌న ఎక్స్‌ప్రెష‌న్‌ని చెక్ చేసుకుంటారు. ఆ సీన్‌లో త‌న‌తోపాటు ఎవ‌రెవ‌రు యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుని, అవ‌త‌లి వాళ్లు చిన్న యాక్ట‌ర్ అయినా స‌రే వాళ్ల ద‌గ్గ‌ర‌కి వెళ్లి సీన్ ప్రాక్టీస్ చేద్దామా.. అని అడిగి వాళ్ల‌తో క‌లిసి డైలాగ్‌ని మ‌రోసారి ప్రాక్టీస్ చేస్తారు. అవ‌త‌లి వారు డైలాగ్ ఎలా చెప్తున్నారో చూస్తారు. ఎదుటివారు ఎలా చెప్తే ఎలాంటి రియాక్ష‌న్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారాయ‌న‌. మామూలుగా ఏ యాక్ట‌ర్ అయినా త‌మ డైలాగ్‌ని చ‌దువుకుని.. కారావ్యాన్‌లో వెయిట్ చేస్తారు షాట్ కోసం. అమితాబ్ గారు అలా కాదు.. అందుకే ఆయ‌న అమితాబ్ బ‌చ్చ‌న్‌ అయ్యారు. ఆయ‌న‌తో పోలిస్తే మ‌నం ఎంత‌? అందుకే ప్రాక్టీస్ చేయండి. ప‌నిలో ఉన్నా.. ప‌నిలేకుండా ఖాళీగా ఉన్నా.. ఏది తెలిస్తే దాన్ని సాధ‌న చేయండి. సిగ‌రెట్ విసిరితే క‌రెక్టుగా నోట్లో ప‌డాలి. ప‌డితే నువ్వు ర‌జ‌నీకాంత్ అవుతావు’’ అని పూరి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని