Temper: ఆర్‌. నారాయణమూర్తి ‘టెంపర్‌’లో నటించకపోవడానికి కారణమిదే

ఎన్టీఆర్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘టెంపర్‌’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం..

Published : 13 Feb 2024 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ (NTR) కెరీర్‌లో విభిన్న చిత్రం ‘టెంపర్‌’ (Temper). పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని కానిస్టేబుల్‌ మూర్తి పాత్ర కోసం ముందుగా ఆర్‌. నారాయణమూర్తి (R Narayana Murthy)ని దర్శకుడు సంప్రదించగా ఆయన తిరస్కరించారు. అందుకు కారణమేంటో ఈ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చూద్దాం..

ఆ పాత్రను ఎందుకు రిజెక్ట్‌ చేశారో ఆర్‌. నారాయణమూర్తి ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘టెంపర్‌’లో అంత గొప్ప వేషాన్ని నాకు ఇవ్వడానికి వచ్చిన పూరీ జగన్నాథ్‌కు నేను సెల్యూట్‌ చేస్తున్నా. ఆ పాత్రను ఆర్‌. నారాయణమూర్తి పోషిస్తే సినిమా ఆడేస్తుందని ఆయన నాకు ఆఫర్‌ చేయలేదు. నాతో ఒక గొప్ప క్యారెక్టర్‌ చేయిద్దాం.. డిఫరెంట్‌ వేషం వేయిద్దాం అన్న ఉద్దేశంతో నాకు ఇవ్వాలనుకున్నారు. ఎన్టీఆర్‌ కూడా ఎంతో ప్రేమతో అడిగారు. కానీ, ‘ఈ పాత్రలో నేను నటించలేను. నన్ను మన్నించండి’ అని అన్నాను. ఎందుకంటే.. నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగాను. ఇక నేను సినిమాలు చేస్తే ఐదారేళ్లకు మించి చేయను. అందుకే మళ్లీ నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నా. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు’’ అని తెలిపారు.

ఆర్‌. నారాయణమూర్తి చేయనన్న పాత్రను రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చేశారు. అవినీతి పోలీస్‌ అధికారి అయిన దయా (ఎన్టీఆర్‌)కు కనీసం సెల్యూట్‌ కూడా చేయని వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. అయితే, దయా మారిపోయిన అనంతరం సెల్యూట్‌ చేస్తూ,  చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని